నారాయణపేట: తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులు సాధించడంతో పాటు భూసారాన్ని పరిరక్షించేందుకు రైతులు సహజ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అవలంబించాలని తెలంగాణ రై తు విజ్ఞాన కేంద్రం, నారాయణపేట సమన్వయకర్త డా. ఈటెల సత్యనారాయణ సూచించారు. వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మండలంలోని సింగారం రైతువేధికలో గురువారం అభ్యుదయ రైతులు, కృత్రిమ సేద్యం చేపడుతున్న రైతులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నాకాలం–2026లో సాగు చేస్తున్న వివిధ పంటల్లో శాసీ్త్రయ యాజమాన్య పద్ధతులు, సహజ సేద్యం ప్రయోజనాలపై నిపుణులు రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డా. ఈటెల సత్యనారాయణ మాట్లాడుతూ.. భూసార పరీక్షల ఆధారంగానే ఎరువుల వినియోగం చేపట్టాలని సూచించారు. నేల అవసరాలకు అనుగుణంగా సమతుల ఎరువులను వినియోగించడంతో వ్యయాన్ని తగ్గించుకోవచ్చన్నారు. రసాయన ఎరువులు అధికంగా వినియోగించకుండా సేంద్రియ, జీవ ఎరువులతో పాటు సహజ వ్యవసాయ పద్ధతులను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, నూనెగింజల పంటలకు ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు పంటల వైవిధ్యీకరణ చేపట్టాలన్నారు. నానో ఎరువులను వినియోగించాలని.. నేల ఆరోగ్యాన్ని కాపాడే సాగు పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అనంతరం నానో ఎరువుల వినియోగం, ప్రయోజనాలపై క్షేత్ర పర్యటన నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్, ఆత్మా అధికారి శాంతి నిర్మల, వ్యవసాయ అధికారి బాల దినకర్ పాల్గొన్నారు.


