బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన..
కొత్తపల్లి: రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ నెల 4న ఉమ్మడి మద్దూరు మండలంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించేందుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శ్రీధర్ మంగళవారం కలెక్టర్ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్, కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ముందుగా మద్దూరు సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతల్‌దిన్నె మార్గంలో కొనసాగుతున్న సాంఘిక సంక్షేమశాఖ గురుకుల పాఠశాల, కళాశాల పనులను పరిశీలించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురుకుల పాఠశా ల, కళాశాల ప్రాంగణంలో భవన నిర్మాణానికి సంబంధించిన మ్యాప్‌లు, టైంలైన్‌తో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు వేగవంతం చేసి మార్చిలోపు పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనువైన ప్రదేశాలను పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాటుకు మద్దూరు సమీపంలోని డిగ్రీ కళాశాల భవనం వద్ద ఒక స్థలం, చింతల్‌దిన్నె సమీపంలో మరో స్థలాన్ని పరిశీలించి అవసరమైన భద్రతా, సాంకేతిక ప్రమాణాలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందస్తుగా పూర్తి చేయాలని సీఎం ప్రధానకార్యదర్శి శ్రీధర్ వివరించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 4వ తేదీన మద్దూరు మండలంలో పర్యటించనున్నందున మంగళ వారం ఎస్పీ డా. వినీత్ గురుకుల పాఠశాల, కళాశాల వద్ద హెలీప్యాడ్ ఏర్పాటు చేయనున్నందున భద్రతా ఏర్పాట్లను, ముఖ్యమంత్రి ప్రయాణించే రూట్‌లో బందోబస్తు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. హెలీప్యాడ్ నుంచి కార్యక్రమ ప్రదేశాల వరకు వాహనాల రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వీవీఐపీ రూట్ తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పటిష్ట భద్రతా ఏర్పాట్లు, సమన్వయంతో కూడి న బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని డీఎస్పీ మహేష్, సీఐ సైదులు, మద్దూరు ఎస్సై విజయ్‌కుమార్‌కు సూచించారు. సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తూ ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు.


