● చిన్నచింతకుంటలో
కాంగ్రెస్–బీఆర్‌ఎస్ శ్రేణుల తోపులాట
● విధుల్లో అస్వస్థతకు గురైన డీఎస్పీ.. రోడ్డుపై మాజీ ఎమ్మెల్యే నిరసన
చిన్నచింతకుంట: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల పరస్పర ర్యాలీలతో చిన్నచింతకుంట మండల కేంద్రంలో గురువారం ఉద్రిక్తత నెలకొంది. రెండు పార్టీల కార్యక్రమాలు ఒకేసారి బస్టాండ్ కూడలికి చేరుకోవడంతో కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ రమణరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల విజయోత్సవంలో భాగంగా దేవరకద్ర నియోజకవర్గంలోని చిన్నచింతకుంటు మండలంలో ఉదయం నెల్లికొండి నుంచి బైక్ ర్యాలీ నిర్వహించింది. ఉదయం 11 గంటల సమయంలో ర్యాలీ చిన్నచింతకుంట బస్టాండ్ కూడలికి చేరుకోగా ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన సమరభేరి కార్యక్రమం ర్యాలీగా అక్కడికి చేరుకుంది. బీఆర్‌ఎస్ ర్యాలీని పోలీసులు దారి మళ్లించే ప్రయత్నం చేయగా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ కార్యక్రమానికి ముందుగానే అనుమతి ఉందని, సమయం దాటిపోతోందని పేర్కొంటూ కార్యక్రమానికి అనుమతించాలని కోరారు. పోలీసులు అనుమతించకపోవడంతో కార్యకర్తలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
అనుమతులపై పోలీసుల వివరణ
కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీకి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే బీఆర్‌ఎస్ సమరభేరి కార్యక్రమానికి అనుమతి ఇవ్వలేదని సీఐ పేర్కొన్నారు. పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వకుండానే బీఆర్‌ఎస్ నాయకులు కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఇరు పార్టీల కార్యక్రమాలు ఒకేసారి కొనసాగడంతో ఉద్రిక్తత ఏర్పడిందని పోలీసులు వెల్లడించారు.
రెండు పార్టీల కార్యక్రమాలకు ఒకేరోజు పోలీసులు అనుమతి ఇవ్వడంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా సుమారు 50 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇందులో సీఐ, డీఎస్పీ, నలుగురు ఎస్సైలు, 15 మంది స్పెషల్ ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. కాగా, ర్యాలీలో బీఆర్‌ఎస్ కార్యకర్తలను అదుపు చేసే క్రమంలో జరిగిన తోపులాటలో డీఎస్పీ వెంకటరమణరెడ్డి అస్వస్థతకు గురై అక్కడే పడిపోయారు. వెంటనే ఆయనను కాంగ్రెస్ కార్యాలయంలోకి తీసుకెళ్లగా కొద్దిసేపటికి కోలుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆయనకు మంచినీళ్లు అందించి ధైర్యం చెప్పారు.


