రాస్తారోకో చేస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు
మరికల్: కోయిల్‌సాగర్ ఆయకట్టుకు ప్రాజెక్టు నీటిని విడుదల చేయాలని బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు లంబడి తిరుపతయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం మరికల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులో 16 అడుగులకు నీళ్లు చేరగానే సాగునీరు విడుదల చేశామన్నారు. ప్రస్తుతం 17 అడుగులకు చేరినా అధికారులు కాల్వల ద్వారా రైతులకు సాగునీరు వదలడం లేదన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే పంటలు ఎండుముఖం పడడంతో రైతులు తీవ్ర సంక్షోభంలో ఇరుక్కురన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి కుడి, ఎడమ కాల్వలకు సాగునీరు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆయకట్టు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. మాజీ వైస్ ఎంపీపీ రవి, నాయకులు రామస్వామి, బసంత్, నారాయణ, ప్రకాశ్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు.


