బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం | - | Sakshi
Sakshi News home page

బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

నారాయణపేట: బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ ప్రియాంక అన్నారు. గురువారం జిల్లాకేంద్రం సమీపంలోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు ఎస్పీ డా. వినీత్‌ పాల్గొని పురోహితులు, పాస్టర్లు, ఖాజీ లకు బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. 18 ఏళ్లు నిండని బాలికలకు వివాహం చేయడంతో విద్య, ఆరోగ్యం, భవిష్యత్‌పై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. బాల్య వివాహాల నివారణలో పురోహితులు, ఖాజీలు, పాస్టర్లు కీలక పాత్ర పోషిస్తారని, బాల్య వివాహం నిర్వహించేందుకు ఎవరైనా సంప్రదిస్తే అడ్డుకోవాలని చెప్పారు. కుటుంబ ఒత్తిడి, ప్రేమ వ్యవహారం, సామాజిక పరిస్థితులు తదితర కారణాలను చూపుతూ బాల్య వివాహాలను సమర్థించడం సరికాదని స్పష్టం చేశారు. చిన్న వయసులో గర్భధారణతో రక్తహీనత, ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందన్నారు. జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహం జరుగుతున్నట్లు తెలిస్తే తహసీల్దార్‌, సీడీపీఓ లేదా చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. శ్రావణ మాసంలో జరిగే వివాహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, అనుమానాస్పద సందర్భాల్లో తక్షణమే పరిశీలన చేపట్టాలని ఆదేశించారు.

బాల్య వివాహం చట్ట విరుద్ధం.. వివాహం పవిత్రమైన కార్యక్రమమే అయినప్పటికీ బాల్య వివాహం మాత్రం చట్టవిరుద్ధమని ఎస్పీ డా. వినీత్‌ స్పష్టం చేశారు. వివాహ ముహూర్తం నిర్ణయించే సమయంలో జాతకం, గుణమేళనం వంటి అంశాలను పరిశీలించినట్లే వధూవరుల వయసును కూడా తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. 18 ఏళ్లు పూర్తికాని బాలిక వివాహానికి అంగీకరించవద్దని, వయస్సుపై అనుమానం ఉంటే వివాహాన్ని నిర్వహించకుండా పోలీస్‌, సీడీపీఓ లేదా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తప్పుడు ధ్రువపత్రాలతో వివాహం జరిపించేందుకు ప్రయత్నించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బాలికలకు వివాహమే జీవిత లక్ష్యం కాదని, విద్య, ఉద్యోగం, స్వయం సమృద్ధి, మంచి భవిష్యత్‌ లక్ష్యాలుగా ఉండేలా సమాజం ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగంగా ఇప్పటికే సర్పంచులు, చైల్డ్‌ మ్యారేజ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ కార్యదర్శులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. మక్తల్‌, కొడంగల్‌, కోస్గి తదితర ప్రాంతాల్లోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అనంతరం బాల్య వివాహాల నిర్మూలనపై రూపొందించిన బ్రోచర్లను కలెక్టర్‌, ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూఓ రాజేందర్‌గౌడ్‌, డీపీఆర్వో రషీద్‌, డీసీపీఓ కరిష్మా, చైల్డ్‌లైన్‌ తిరుపతయ్య, సీడీపీఓలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement