నారాయణపేట ఎడ్యుకేషన్: కేసుల దర్యాప్తులో జా ప్యం చేస్తే సహించేది లేదని, పోలీసు అధికారులు నీతి నిజాయితీతో పని చేయాలని ఎస్పీ డా. వినీత్ సూచించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులతో నిర్వహించిన జిల్లాస్థాయి క్రైం రివ్యూకు ఆయన హాజరై మాట్లాడారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించి నేరాల నియంత్రణకు తగిన చర్యలు తీసుకొని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు. ప్రతి కేసులో నాణ్యమైన విచారణ జరగాలని.. సరైన ఆధారాలతో నేరస్తులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా పెట్రోలింగ్, బ్లూకోల్ట్స్ సిబ్బంది గస్తీ నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, నిషేధిత గంజాయి, గుట్కా, మట్కా, జూదంలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. గ్రామాలు, పట్టణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి అవి పనిచేసే విధంగా మానిటరింగ్ చేయాలని సూచించారు. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించాలని కోరారు. అనంతరం జూలైలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 33 మంది పోలీసులకు ప్రశంసాపత్రాలు అందించి అభినందించారు.


