‘సైబర్‌’ నియంత్రణకు అవగాహనే ఆయుధం | - | Sakshi
Sakshi News home page

‘సైబర్‌’ నియంత్రణకు అవగాహనే ఆయుధం

Aug 6 2026 1:15 AM | Updated on Aug 6 2026 1:15 AM

పోస్టర్ల ఆవిష్కరణ..

నారాయణపేట: సైబర్‌ నేరాలు జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే.. ముందస్తుగా ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడమే అత్యంత ఉత్తమ మార్గమని కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక, ఎస్పీ డా. వినీత్‌ అన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సైబర్‌ అవగాహన సదస్సుకు వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌ ప్రియాంక తను విధుల్లో ఉన్న సమయంలో ఎదురైన సైబర్‌ మోసాలను ప్రస్తావించారు. సైబర్‌ మోసానికి గురైన వారు భయపడకుండా, సిగ్గుపడకుండా వెంటనే కుటుంబ సభ్యులకు చెప్పి పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రతి గ్రామంలో సైబర్‌ భద్రతపై అవగాహన కల్పించడం ప్రజాప్రతినిధుల సామాజిక బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు. మహిళా సంఘాలు, వీఓలు, స్వయం సహాయక సంఘాల సమావేశాల్లోనూ సైబర్‌ భద్రతపై చర్చించాలని సూచించారు. విద్యార్థులు తాము నేర్చుకున్న విషయాలను తల్లిదండ్రులకు వివరించి కుటుంబ సభ్యులను అప్రమత్తం చేయాలని పిలుపునిచ్చారు. ఎవరూ ఉచితంగా డబ్బు ఇవ్వరనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

భయం.. ఆశే నేరగాళ్ల ఆయుధాలు..

సైబర్‌ నేరాలు కేవలం ఆర్థిక నష్టానికే పరిమితం కావడం లేదని, బాధితుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఎస్పీ డా. వినీత్‌ తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు ప్రధానంగా భయం, ఆశ అనే రెండు ఆయుధాలతో ప్రజలను మోసం చేస్తున్నారని పేర్కొన్నారు. ఉద్యోగాల పేరుతో నకిలీ లింకులు పంపడం, వ్యక్తిగత ఫొటోలను మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం, బిట్‌కాయిన్‌ వంటి డిజిటల్‌ కరెన్సీల ద్వారా డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి పద్ధతులతో యువతను లక్ష్యంగా చేసుకుంటున్నారని వివరించారు. కుటుంబ భవిష్యత్‌కు ఆధారమైన సొమ్మును కోల్పోతే పరిస్థితి ఎంత విషాదంగా ఉంటుందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. గ్రామస్థాయిలో పోలీసు సేవలను మరింత చేరువ చేసేందుకు గ్రామపంచాయతీల్లో పోలీసు సమాచారం, ఫిర్యాదు పెట్టెలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కేసుల పురోగతి, అత్యవసర హెల్ప్‌లైన్‌ నంబర్లు, సైబర్‌ భద్రత సమాచారాన్ని గ్రామస్థాయిలోనే ప్రజలకు అందుబాటులో

ఉంచుతున్నామన్నారు.

అనంతరం ‘సురక్ష కా తిరంగా’, సైబర్‌ అవగాహన వాల్‌పోస్టర్లను కలెక్టర్‌, ఎస్పీ ఆవిష్కరించారు. సైబర్‌ బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీలు మహేష్‌, నల్లపు లింగయ్య, డీఎంహెచ్‌ఓ డా. జయచంద్రమోహన్‌, సీఐలు శివశంకర్‌, రాంలాల్‌, భగవంత్‌రెడ్డి, సైదులు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement