రోడ్డు భద్రత నియమాలు తప్పనిసరి
నారాయణపేట: రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రత నియమాలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు సూచించారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు బుధవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి తన చాంబర్‌లో రోడ్డు సురక్ష అభియాన్–2026 కరపత్రం విడుదలచేసి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో మెలిగి ప్రమాదాలను నివారించాలన్నారు. అధిక వేగంతో వాహనాలను నడిపి ప్రాణాలను కోల్పోవద్దని.. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలను నడపరాదన్నారు. వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లిన తమ కోసం తమ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జి వింధ్యా నాయక్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్‌జడ్జి బి.సాయిమనోజ్, అదనపు జూనియర్ సివిల్‌జడ్జి కె.అవినాష్, ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణచైతన్య పాల్గొన్నారు.


