● మార్మోగిన గోవింద నామస్మరణ
● భారీగా తరలివచ్చిన భక్తజనం
● పాల్గొన్న ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, ఎమ్మెల్యే తదితరులు
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం 11.30 గంటలకు అశేష జనవాహిని నడుమ రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. రథోత్సవం సందర్భంగా వివిధ రకాల రంగురంగుల పూలు, మామిడి తోరణాలు, కొబ్బరి ఆకులతో రథాన్ని ముస్తాబు చేశారు. వనపర్తి సంస్థానాధీశుడు, ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాజా కృష్ణదేవరావు, ఆయన కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అర్చకులు ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయ అర్చకుడు విష్ణునారాయణశర్మ పర్యవేక్షణలో వేద పండితులు శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామి ఉత్సవమూర్తులను పట్టువస్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి వేద మంత్రోచ్ఛారణలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళ వాయిద్యాలు, భక్తుల గోవింద నామస్మరణల నడుమ ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఆలయం నుంచి రథం వద్దకు తీసుకొచ్చి ఆసీనులు చేశారు. సంస్థానాధీశుడు రాజా కృష్ణదేవరావు టెంకాయ కొట్టగా ఆయనతో పాటు వారి కుమారుడు ఆరుద్రదేవ్, ఎమ్మెల్యే భక్తులతో కలిసి రథాన్ని ప్రధాన ఆలయం నుంచి గోదాదేవి ఆలయం వరకు లాగారు. రథోత్సవాన్ని తిలకించేందుకు ఉమ్మడి జిల్లాతో పాటు, వివిధ ప్రాంతాల భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు రథం ముందు టెంకాయలు కొట్టి పూజలు చేశారు. సాయంత్రం భక్తులు రథాన్ని తిరిగి ఆంజనేయస్వామి ఆలయం వరకు, అటు నుంచి రథశాలకు చేర్చారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు శ్రీరంగాపురం సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. గ్రామానికి చెందిన మంగలి నారాయణదాస్ జ్ఞాపకార్థం వారి కుమారులు ఎన్.జయప్రకాష్ కుటుంబసభ్యులతో కలిసి భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయ ఆవరణలో వెలిసిన మిఠాయిలు, బొమ్మలు, గాజుల దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాంబు, ఎస్‌ఐ హిమబిందు సిబ్బందితో కలిసి కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.


