వైజ్ఞానిక మేళాకు వేళాయె..
నారాయణపేట రూరల్: విద్యార్థులలో మేధాసంపత్తి పెంపునకు.. నూతన ఆవిష్కరణలకు.. సృజనాత్మకతను వెలికి తీసేందుకు యేటా నిర్వహించే విద్యా వైజ్ఞానిక మేళా నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సిద్ధమైంది. శుక్రవారం నుంచి నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో రెండు రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. పిల్లల్లో శాసీ్త్రయ ఆలోచనలు ప్రోత్సహించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు విజ్ఞాన కార్యక్రమాలు నిర్వహిస్తున్న క్రమంలో భావిశాస్త్రవేత్తల ఎంపికకు ఈ వేదిక ప్రధాన భూమిక పోషించనుంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాల, కళాశాలలకు సంబంధించి 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులతో పాటు డీఎడ్, బీఎడ్ ట్రైనీ ఉపాధ్యాయులు తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా విధి నిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులు సైతం నూతన ఆవిష్కరణలతో బోధనా సామగ్రి ప్రదర్శనకు అవకాశం కల్పిస్తారు. 6 నుంచి 8వ తరగతి జూనియర్స్, 9నుంచి 12వ తరగతి సీనియర్స్ విభాగాలుగా విభజించి పోటీలు చేపట్టనున్నారు. ఒక పాఠశాల నుంచి ప్రతి ఉపాంశానికి ఒకటి చొప్పున ఐదు ప్రాజెక్టులు ప్రదర్శించే అవకాశం ఉంది. విద్యార్థులతోపాటు గైడ్ టీచర్ హాజరు కావాల్సి ఉంటుంది. ఉత్తమంగా నిలిచిన ప్రాజెక్టు రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తారు.
ఇన్‌స్పైర్ ప్రాజెక్టులు సైతం
2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన జిల్లా స్థాయి ఇన్‌స్పైర్ ప్రదర్శనలు సైతం ఈ వేదికపై కనిపించనున్నాయి. జిల్లావ్యాప్తంగా కేవలం 19 ప్రాజెక్టులు మాత్రమే ఎంపికయ్యాయి. వారు ఆన్‌లైన్‌లో వివరించిన ఆవిష్కరణల తయారీకి ఇప్పటికే సదరు విద్యార్థుల ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.10వేల చొప్పున నగదు జమ చేశారు. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులకు మార్గ నిర్దేశం చేశారు.
ఏర్పాట్లు పూర్తి
జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహణకు జిల్లా విద్యాశాఖ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. నారాయణపేట మండలంలోని జాజాపూర్ గ్రామ జెడ్పీ ఉన్నత పాఠశాలలో వేదిక ఏర్పాటు చేశారు. శుక్ర, శనివారాలు రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకుఈ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి 150మంది ఉపాధ్యాయులతో 22 కమిటీలు ఏర్పా టు చేసి పర్యవేక్షిస్తున్నారు. హాజరయ్యే విద్యార్థులు ఉపాధ్యాయులకు అవసరమైన వసతి, భోజనం ఏర్పాటు చేయనున్నారు. ఇదిలాఉండగా, రెండు నెలల ముందు నుంచే విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు సమయం ఉండగా జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఉపాధ్యాయ సంఘాలు విమ ర్శిస్తున్నాయి. ఈ నెల 5 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఆదరాబాదరా చివరి నిమిషంలో తూతూ మంత్రంగా వైజ్ఞానిక ప్రదర్శన చేపట్టడం సరికాదని వాపోయారు. అటు మంత్రులు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో ఉండడం.. రెగ్యులర్ కలెక్టర్ సెలవులో ఉన్న సమయంలో నిర్వహణ చేపట్టడం సబబు కాదని బహిరంగంగా విమర్శలు వస్తున్నాయి.
సమన్వయంతో విజయవంతం చేస్తాం
జిల్లాస్థాయి వైజ్ఞానిక మేళా జయప్రదం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం. ప్రణాళికా ప్రకారం కమిటీలను వేసి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేపట్టాం. ఉపాధ్యాయ సంఘాలు, మండల స్థాయి అధికారులు, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు తమన్వయంతో విజయవంతంగా పూర్తి చేస్తాం.
– గోవిందరాజు, డీఈఓ
ప్రధాన అంశం..ఉప అంశాలు ఇవీ..
ఈ విద్యా సంవత్సరం విద్యా వైజ్ఞానిక సదస్సులో ప్రధాన అంశంగా అభివృద్ధి చెందిన, స్వయం సమృద్ధి భారతదేశ కోసం సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, గణితం (స్టెమ్) గా నిర్ధారించారు. దీనికి తోడు ఏడు ఉప అంశాలను ఎంపిక చేశారు. సుస్థిర వ్యవసాయం, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ప్రత్యామ్నాయ మొక్కలు, హరిత శక్తి (పునరుత్పాదక శక్తి), అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదవరితమైన గణిత నమూనాలు, ఆరోగ్యం పరిశుభ్రత, నీటి సంరక్షణ నిర్వహణపై విద్యార్థులు ప్రాజెక్టులు తీసుకురావాల్సి ఉంటుంది.
సెమినార్ నిర్వహణ
రెండు రోజులపాటు జరిగే ప్రదర్శనలో విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకత కోసం ప్రత్యేక సమినార్‌ను నిర్వహిస్తున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడం అనే అంశంపై జూనియర్, సీనియర్ విభాగాల్లో ఒక్కో పాఠశాల నుంచి ఒక్కో విద్యార్థి పాల్గొనిందుకు అవకాశం ఉంటుంది.
నేడు ప్రారంభంకానున్నసైన్స్‌ఫెయిర్
జిల్లా ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటు
జాజాపూర్ జెడ్పీ ఉన్నత పాఠశాలలో సర్వం సన్నద్ధం
వైజ్ఞానిక మేళాకు వేళాయె..


