
జిల్లాలో ఎరువుల కొరత లేదు..
● పంటల సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ సరఫరా
● కలెక్టర్ సిక్తా పట్నాయక్
దామరగిద్ద: జిల్లాలో ఎరువుల కొరత లేదని.. పంటల సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉన్నాయని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం దామరగిద్దలోని ఆగ్రోస్ రైతు సేవా కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువుల స్టాక్‌ను పరిశీలించారు. జిల్లా వ్యవసాయశాఖ అధికారి జాన్‌సుధాకర్‌తో మాట్లాడి ఎరువుల సరఫరా వివరాలను తెలుసుకున్నారు. రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు ఆధారంగా ఎన్ని ఎకరాల భూమి సాగుచేశారు.. ఎంత యూరియా అవసరం తదితర వివరాలను గుర్తించి ఎరువులు అందించాలని సూచించారు. అదే విధంగా ఒక్కో రైతు ఎన్ని సార్లు యూరియా తీసుకెళ్తున్నాడు.. ఏ పంటకు ఎంత మోతాదులో వేస్తున్నారో తెలుసుకోవాలని వ్యవసాయశాఖ సిబ్బందికి కలెక్టర్ సూచించారు. రైతులకు అవసరమైన ఎరువుల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అదే విధంగా నానో యూరియా, డీఏపీల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో పంటల సాగుకు అవసరమైన ఎరువుల సరఫరా ఉందని.. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కలెక్టర్ వెంట ఏఓ మణిచందర్ తదితరులు ఉన్నారు.