
కుండపోత వర్షం
నారాయణపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఇక కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. మక్తల్ మండలంలోని కర్నే గ్రామానికి వెళ్లేదారిలో కల్వర్టుపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కలెక్టర్ కల్వర్టును పరిశీలించారు. నారాయణపేట మండలంలోని పేరపళ్ల వాగు వరద ఉధృతమవడంతో సీఐ శివశంకర్ పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లాలో కల్వర్టులు, బ్రిడ్జిలు, వాగులపై పారుతున్న వరద తగ్గేంతేవరకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు తమకు వర్షం, వరదల సమాచారాన్ని చేరవేయాలని జిల్లా యంత్రాంగానికి కలెక్టర్, ఎస్పీ యోగేష్‌గౌతమ్ సూచించారు. ఎడతేరిపి లేకుండా కురుస్తున్న వానాలతో పంటపొలాల్లో నీరు నిల్వ ఉండడం.. తెగుళ్ల భారిన పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
జిల్లాలో వర్షపాతం వివరాలిలా..
జిల్లాలోని ఆదివారం నుంచి సోమవారం ఉదయం వరకు పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. దామరగిద్ద 51.2 మి.మీ వర్షపాతం, నారాయణపేట 60.2, ఊట్కూర్ 47.9, మాగనూర్ 38.2, కృష్ణా 37.1, మక్తల్ 43.3, నర్వ 45.8, మరికల్ 53.6, ధన్వాడ 45.8, మద్దూరు 42.7, కోస్గి 34.2, గుండుమాల్ 55.5, కొత్తపల్లి 47.3 మి.మీల వర్షపాతం నమోదైంది.
నిలిచిపోయిన రాకపోకలు
భూనేడ్ నుంచి మద్దూర్ మధ్యలో ఉన్న భూనేడ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండు రోజులుగా ఇరువైపులా రాకపోకలు నిలిచిపోయాయి. కొత్తపల్లి – భూనేడ్ మధ్య నూతనంగా బ్రిడ్జి నిర్మాణం చేపట్టడంతో తాత్కాలిక బ్రిడ్జి ఏర్పాటు చేయగా.. వరద పోటెత్తడంతో తాత్కాలిక బ్రిడ్జి తేగిపోయింది. దీంతో ఆయా గ్రామాల ప్రయాణిలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మక్తల్ మండలంలోని నేరడ్‌గాం, సంగంబండ బ్రిడ్జి, ముస్లాయపల్లి, పారేవుల మధ్య, గొల్లపల్లి–మంతోన్‌గోడ్, సామాన్‌పల్లి–మంతోన్‌గోడ్, కాచ్‌వార్ –ఎడివెల్లి, చిట్యాల– పంచదేవ్‌పహాడ్, కర్నె– చిట్యాల మధ్యలో కల్వర్టులపై వరద పారుతుండడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మాగనూర్ మండలంలోని వర్కూర్ వంతెనా, అడవి సత్యారం పెద్దవాగు ఉగ్రరూపం దాల్చడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
నిండిన చెరువులు
నారాయణపేట రూరల్: మండలంలోని కోటకొండ, బండగొండ, అప్పిరెడ్డిపల్లి, బైరంకొండ చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతుంది. సింగారం, అభంగాపూర్ వాగులకు వరద పోటెత్తింది. ఇక జాజాపూర్ గ్రామశివారులో లోలెవల్ వంతెనపై నుంచి నీరు వెళ్తుండటంతో శేర్నపల్లి గ్రామానికి రాకపోకలకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా అభంగాపూర్ వాగులో నీటి స్థాయి పెరుగుతుండటంతో బండగొండ, భూనేడ్ వైపు వాహన రాకపోకలకు ఆటంకం కలిగింది. బైరంకొండ చెరువు నీరు కర్ణాటక వైపు వెళ్ళే రహదారిపైకి రావడంతో జలాల్‌పూర్, యాద్గీర్ వైపు రాకపోకలు కొంత సమయం నిలిచిపోయాయి. పేరపళ్ళ చెరువు నీరు రోడ్డుపైకి రావడంతో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.
జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు,వంకలు
పలు గ్రామాల్లో నిలిచిపోయిన రాకపోకలు
పంటల్లో నిలిచిన నీరు.. రైతుల ఆందోళన
కలెక్టర్, జిల్లా అధికారుల పరిశీలన