
పండుగలు శాంతియుతంగా జరుపుకోవాలి : ఎస్పీ
మక్తల్: పండుగలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని, వినాయక చవితి వేడుకలకు సంబంధించి డీజేలకు అనుమతి లేదని ఎస్పీ యోగేష్‌గౌతమ్ అన్నారు. సోమవారం మక్తల్‌లో మక్తల్, మాగనూర్, కృష్ణ మండలాలకు చెందిన గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, హిందూ మత పెద్దలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పండుగలు, దేవతల ఊరేగింపులో డీజేలు, పెద్ద శబ్దం వచ్చే బాణాసంచాలకు అనుమతి లేదని, ఉత్సవ కమిటీ సభ్యులందరు సహకారించాలని అన్నారు. భారీ శబ్దాలతో వృద్ధులు, చిన్నారులు, ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. గణేష్ మండపాల ఏర్పాటు, డెకరేషన్, ఇతర సందర్భాల్లో చుట్టుపక్కల వారిని ఇబ్బంది పెట్టవద్దని, తప్పనిసరిగా మండపాల ఏర్పాటుకు పోలీస్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలన్నారు. ఏదైనా సమస్య ఏర్పడితే స్థానిక పోలీసులను సంప్రదించాలని, 24 గంటలు ఒక వలంటీర్ మండపాల దగ్గరే ఉండాలని అన్నారు. ట్యాంకు బండ్ దగ్గర పరిశుభ్రంగా చెత్తాచెదారం లెకుండా ఉంచాలన్నారు. వినాయక ఉత్సవ కమిటీల వారు పోలీసులకు సహకరించాలని అన్నారు.కార్యక్రమంలో డీఎస్పీ లింగయ్య, సిఐలు రాంలాల్, ఎస్‌ఐలు భాగ్యలక్ష్మిరెడ్డి, నవీద్, ఆశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు.