
విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా బోధన చేయాలి
నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా విద్యాబోధన చేయాలని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. మండలంలోని జాజాపూర్‌లో మంగళవారం ఏర్పాటుచేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టీఎల్‌ఎం) మేళాను ట్రెయినీ కలెక్టర్ ప్రణయ్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. పాఠ్యాంశాలు చక్కగా అర్థం కావడానికి బోధనోపకరణాలు ఎంతో ఉపకరిస్తాయని అన్నారు. ఒక్కో టీచర్ వద్ద ఒక్కొక్క వినూత్న విధానం దాగి ఉంటాయని.. వాటన్నిటిని ఇలాంటి మేళాలో ప్రదర్శించడం వల్ల మరింత మంది ఉపాధ్యాయులు నేర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు. కాగా, మండలస్థాయి మేళాలో మొత్తం 125 ప్రాజెక్టులను ప్రదర్శించగా.. వీటిలో 10 ప్రాజెక్టులను జిల్లాస్థాయికి ఎంపిక చేసినట్లు డీఈఓ గోవిందరాజులు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ, జీహెచ్‌ఎంలు అనురాధ, సత్యనారాయణ సింగ్, సునీత, భారతి, డీఎస్‌ఓ భాను ప్రకాశ్, యాదయ్యశెట్టి పాల్గొన్నారు.
● పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ప్రభుత్వం మంజూరుచేసిన ఇందిరమ్మ ఇళ్లను నాణ్యతగా నిర్మించుకోవాలని ఎమ్మెల్యే పర్ణికారెడ్డి లబ్ధిదారులకు సూచించారు. జాజాపూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆమె పరిశీలించి.. బేస్‌మెంట్ లెవల్ పూర్తిచేసిన 14మంది లబ్ధిదారులకు రూ. లక్ష చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు మంజూరైన వంట సామగ్రిని అందజేశారు. మండలంలోని లక్ష్మీపూర్‌లో వర్షానికి కూలిన చంద్రప్ప, సుదర్శన్‌రెడ్డి ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించి.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఆర్థికసాయం అందించాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్యే వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ రాంపురం సదాశివరెడ్డి, యువజన సంఘం నాయకులు కోట్ల రవీందర్‌రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్ ఉన్నారు.