
అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలి
అర్ధరాత్రి అయినా యూరియా ఇవ్వాల్సిందే..
మక్తల్: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల్లో పురోగతి ఉండాలని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం మక్తల్ పట్టణంలో 150 పడకల ఆస్పత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. అందులో భాగంగా మక్తల్‌లో అన్ని హంగులతో 150 పడకల ఆస్పత్రి భవనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. కొత్త ఆస్పత్రిలో అధునాతన సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆస్పత్రి భవన నిర్మాణ పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. నాణ్యత విషయంలో రాజీ పడొద్దన్నారు. అనంతరం కర్ని గ్రామంలో చెరువు అలుగును మంత్రి పరిశీలించారు. పంచదేవ్‌పాడులో నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవంలో మంత్రి వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాల్లో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నర్సింహాగౌడ్, మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ గణేశ్‌కుమార్, కట్ట సురేశ్, రాజుల ఆశిరెడ్డి, కృష్ణయ్య, వెంకటేశ్, రాము, చిన్న హన్మంతు, బాలప్ప, ఆంజనేయులుగౌడ్, లింగప్ప రవికుమార్ పాల్గొన్నారు.
నర్వ: రైతులు యూరియా కోసం పంపిణీ కేంద్రాల వద్దకు వస్తే అర్ధరాత్రి అయినా అందించాల్సిందేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. నర్వ పీఏసీఎస్‌లో యూరియా స్టాక్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో నర్వ మండలానికే 20 శాతం ఎక్కువ యూరియాను సరఫరా చేయడం జరిగిందని.. రైతులకు యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పీఏసీఎస్ సిబ్బందికి మంత్రి సూచించారు. యూరియాను పక్కదారి పటిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, పీఏసీఎస్‌లో సీఈఓ అందుబాటులో లేకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. యూరియా పంపిణీ పూర్తయ్యే వరకు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చెన్నయ్యసాగర్ ఉన్నారు.