
భూ నిర్వాసితులకు అండగా నిలుస్తాం
నారాయణపేట/దామరగిద్ద: పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం భూ నిర్వాసితులకు అండగా నిలుస్తామని డీసీసీ మాజీ అధ్యక్షుడు కుంభం శివకుమార్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం భూ నిర్వాసితుల సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ నిర్వాసితుల సంఘం గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్, రైతు సంఘం నాయకులు వెంకోబ, గోపాల్, ధర్మరాజుగౌడ్ తదితరులు మాట్లాడారు. తాము ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదని.. ప్రతి ఎకరానికి రూ. 30లక్షల నష్టపరిహారం, ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. అనంతరం శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు న్యాయం చేయడమే తన లక్ష్యమన్నారు. అవసరమైతే సీఎం కాలు మొక్కి న్యాయమైన పరిహారం చెల్లించేలా చూస్తానని భరోసానిచ్చారు. గతంలో 69 జీఓపై కొందరు దొంగ నాటకాలు ఆడారని అన్నారు. ఇటీవల కానుకుర్తికి వచ్చిన ఓ నాయకురాలు రైతులను మభ్యపెట్టే విధంగా మాట్లాడారని.. తాము పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా సాగునీరు తెస్తామని చెప్పడం హస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పేట–కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి తీరుతామన్నారు. జిల్లా రైతాంగానికి సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరూ రాజకీయాలు చేయొద్దని కోరారు. భూ నిర్వాసితుల తరఫున ఈ నెల 22 తర్వాత సీఎంను కలిసే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అదే విధంగా దామరగిద్ద మండలం కాన్‌కుర్తి గ్రామంలో భూ నిర్వాసితులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు ఆయన మద్దతు ప్రకటించి మాట్లాడారు. కార్యక్రమాల్లో గోపాల్‌రెడ్డి, శెట్టి రమేశ్, భీంరెడ్డి, ఏఎంసీ చైర్మన్ శివారెడ్డి, పీఏఎస్‌సీ చైర్మన్ ఈదప్ప, మాజీ ఎంపీపీ వెంకట్‌రెడ్డి, భీంరెడ్డి, బసిరెడ్డి పాల్గొన్నారు.
● భూ నిర్వాసితులకు న్యాయం చేసిన తర్వాతే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని భూ నిర్వాసితుల సంఘం తీర్మానించింది. జిల్లా కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ నెల 18నుంచి 19 వరకు భూ నిర్వాసిత గ్రామాల్లో చైతన్య సదస్సులు, 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లో వివిధ రాజకీయ పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు వినతిపత్రాలు అందజేయడం, రాష్ట్రస్థాయిలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు, 25న ట్రాక్టర్లతో చలో కొడంగల్ (కాడ) కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు.