
దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాలు
నారాయణపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 11ఏళ్ల కాలంలో పేదరికం, నిరుద్యోగం, ఆకలిచావులు పెరిగిపోయాయన్నా రు. 2020లో విధించిన లాక్‌డౌన్ దివ్యాంగుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉన్న దివ్యాంగుల్లో సగం మందికి యూడీఐటీ కార్డులు రాలేదని.. 65శాతం మందికి ఉపాధి లేదన్నారు. పోరాటాలతో సాధించుకున్న 2016 ఆర్‌పీడబ్ల్యూ చట్టాన్ని నిర్వీర్యం చేయడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందన్నారు. సుగమ్య భారత్ అభియాన్ పథకం మోదీ ప్రచారం కోసమే తప్ప.. దివ్యాంగుల కోసం కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా చేయూత పింఛన్లు ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం నాయకులు బాబు, రంగయ్య, మల్లప్ప, నర్సప్ప, కృష్ణ, బాలరాజు, బస్వరాజు, పెంటయ్య, మల్లేష్, గోవిందు, చంద్రశేఖర్, సాయబన్న, హన్మంత్ తదితరులు ఉన్నారు.