
‘మోదీతోనే దేశ రక్షణ సాధ్యం’
నారాయణపేట రూరల్: దేశ రక్షణ నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర నాయకుడు నాగురావు నామాజీ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత్ ఎవరితో యుద్ధానికి ఇష్టపడదని, కవ్వింపు చర్యలకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించే విధంగా చర్యలు ఉంటాయని ఆపరేషన్ ఆఫ్ సింధూర్ నిరూపించిందన్నారు. 1993 బొంబాయి బాంబు దాడుల నుంచి, 2001 పార్లమెంట్పై దాడి, 2005 ఢిల్లీ వరుస పేలుళ్లు, 2006 ముంబాయిలో రైలు దాడి, 2008లో బాంబే హోటల్, రైల్వే స్టేషన్లో పేలుళ్లు, 2016 జమ్మూలో ఆర్మీ జవాన్లపై దాడులు, 2019 పుల్వామా దాడి తాజాగా పహల్గాం దాడులకు సంబంధించి దేశం ఎంతో నష్టపోయిందన్నారు. పాక్ చర్యలకు ప్రతీకారంగా ఆపరేషన్ ఆఫ్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ పై చేపట్టిన దాడులు దేశం మొత్తం గర్విస్తుందని అన్నారు. ఇకముందు భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే భయం కలిగే విధంగా దాడులు జరిగాయన్నారు. ఇకనైనా టెర్రరిస్టులను బహిష్కరించి ప్రపంచ శాంతికి పూనుకోవాలని పిలుపునిచ్చారు. దేశంలోనూ పార్టీలకతీతంగా మోడీ చేసిన చర్యలకు అండగా నిలవాలని సూచించారు. అనంతరం నాయకులు ఒకరినొకరు మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకొన్నారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షులు సత్య యాదవ్, పట్టణ అధ్యక్షులు వినోద్, నాయకులు కృష్ణ, వెంకటయ్య పాల్గొన్నారు.