యాసంగి పంటలకు సాగునీరు
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల ఆశలు పదిలం అయ్యాయి. ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంటలకు సాగునీటిని విడుదల చేయడానికి షెడ్యూల్ ఖరారు చేశారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టర్ విజయేందిర, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. జిల్లా ఇరిగేషన్ శాఖ అధికారులు, ఆయకట్టు రైతులతో చర్చించి నీటి విడుదల చేసే తేదీలను ఖరారు చేశారు.
2 టీఎంసీల నీరు..
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు పాత ఆయకట్టు కింద కుడి, ఎడమ కాల్వల యాసంగి సీజన్ పంటలకు సాగునీటిని వదులుతారు. గతేడాది రూపొందించిన షెడ్యూల్‌లో తేదీలను అటు ఇటుగా మార్చి అయిదు తడులుగా నీటిని వదలడానికి నిర్ణయించారు. దేవరకద్ర మండలంలో ఎడమ కాల్వ పూర్తిస్థాయిలో ఉండగా.. కుడి కాల్వ కింద ధన్వాడ, మరికల్, చిన్నచింతకుంట మండలాలు ఉన్నాయి. అయితే పాత ఆయకట్టు ప్రకారం 12 వేల ఎకరాల మేర ఉండగా అందులో పూర్తిస్థాయిలో సాగునీరు అందే అవకాశం ఉండకపోవచ్చని అధికారులు అంటున్నారు. వానాకాలంలో దాదాపు మూడు నెలలపాటు నీటి విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని దీనివల్ల దాదాపు 35 వేల ఎకరాల మేర సాగవుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న 2 టీఎంసీల నీటిలో ఒక టీఎంసీ సాగునీటికి, మరో టీఎంసీ వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగించే విధంగా అధికారులు ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ప్రణాళిక సిద్ధం చేశాం..
కోయిల్‌సాగర్‌లో ఉన్న నీటిని సద్వినియోగం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఉన్న రెండు టీఎంసీల నీటిలో సాగుకు ఒక టీఎంసీ, తాగునీటి అవసరాలకు ఒక టీఎంసీని ఉపయోగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. యాసంగి సీజన్ పంటల కోసం రైతులు ఇప్పటికే వరినారు మడులు సిద్ధం చేసుకోవడం జరిగింది. దీనివల్ల నేరుగా నాట్లు వేసుకోడానికి నీటిని వదిలేందుకు తేదీలను ఖరారు చేశాం. – ప్రతాప్‌సింగ్,
ఈఈ, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు
కోయిల్‌సాగర్ నీటి విడుదల షెడ్యూల్ ఖరారు
పాత ఆయకట్టు 12 వేల ఎకరాలకే అవకాశం
జనవరి 5 నుంచి ఏప్రిల్ 14 వరకు అయిదు తడులు
ప్రాజెక్టులో ప్రస్తుత నీటిమట్టం 32.2 అడుగులు
యాసంగి పంటలకు సాగునీరు


