భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు
నారాయణపేట ఎడ్యుకేషన్: క్రిస్మస్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంతోపాటు మండలాల్లోని చర్చిలలో గురువారం క్రిస్మస్ పర్వదిన సందర్భంగా ప్రార్థన మందిరాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. నారాయణపేటలోని మూడు చర్చిలతో పాటు మండలంలోని బైరంకొండ, కొల్లంపల్లి, సింగారం గ్రామాల్లోని చర్చిలను సర్వాంగ సుదరంగా తీర్చిదిద్దారు. యాద్గిర్ రోడ్డులోని ప్రధాన చర్చి, సింగారంలోని చర్చిలో ఉదయం ప్రత్యేక ప్రార్థనలను, క్రీస్తూ బోధనలు, పలువురి నాటక ప్రదర్శన నిర్వమించారు. అలాగే, మహిళల గీతాలాపన, కానుకల సమర్పణ, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. పాస్టర్లు అమృతం, నాగేష్ యేసయ్య పుట్టుక, చరిత్రతోపాటు ప్రవచనాలు వినిపించారు. సర్వోన్నతుడైన యేసుక్రీస్తూ మానవాళికి మార్గదర్శకుడని, అందరిని రక్షించడానికి వచ్చాడన్నారు. ఇదిలాఉండగా, పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు, యువతీ యువకులు గీతాలాపన, డ్రామా కార్యక్రమాలు అలరించాయి. చర్చి పాస్టర్లు, మత పెద్దలు, ఇతర రాజకీయ నాయకులు వేరువేరుగా జిల్లా కేంద్రంతోపాటు మండలాల పరిధిలోని పలు చర్చిలలో పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో సంఘం చైర్మెన్ వినోద్ కుమార్, కార్యదర్శి ఆనంద్, సంఘం పెద్ద రత్నయ్య, దేవిపుత్ర మరియు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు


