పరిహారం.. పరిహాసం | - | Sakshi
Sakshi News home page

పరిహారం.. పరిహాసం

Dec 26 2025 10:11 AM | Updated on Dec 26 2025 10:11 AM

పరిహా

పరిహారం.. పరిహాసం

జడ్చర్ల: పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద జడ్చర్ల మండలంలో నిర్మిస్తున్న ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ ముంపు గ్రామాలకు పునరావాసం, పునర్నిర్మాణం (ఆర్‌అండ్‌ఆర్‌) పరిహారం పరిహాసంగా మారింది. గతంలో కొల్లాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ఉదండాపూర్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారాన్ని డిసెంబర్‌ 9లోగా అందిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి సైతం పలుసార్లు ఇదేమాట చెప్పారు. దీంతో తమకు నిర్ణీత గడువులోగా పరిహారం అందుతుందని ఆశించిన నిర్వాసితులకు చివరికి నిరాశే మిగిలింది. ఎప్పడెప్పుడా అంటూ నిర్వాసితులు పరిహారం కోసం ఎదురుచూడాల్సి వస్తుంది.

కోడ్‌ అమలు నేపథ్యంలో..

ఉదండాపూర్‌ నిర్వాసితులకు పరిహారం అందించేందుకు ప్రభుత్వం ప్రకటించిన డిసెంబర్‌ 9 గడువు పంచాయతీ ఎన్నికల కోడ్‌ కారణంగా అంతరాయం ఏర్పడింది. కోడ్‌ అమలు సమయంలో నిధులు విడుదలకు అవకాశం లేకపోయింది. అయితే ఎన్నికల కోడ్‌ ముగియడంతో త్వరితగతిన అవార్డు పాస్‌ చేసి పరిహారాన్ని విడుదల చేయాలని నిర్వాసితులు డిమాండ్‌ చేస్తున్నారు. మళ్లీ ఏమైనా ఎన్నికలు వస్తే మరోసారి కోడ్‌ అడ్డంకిగా మారే అవకాశం ఉంటుందని, ఆలోగా నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఉదండాపూర్‌ వాసులకు పెండింగ్‌

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలోని వల్లూరు గ్రామంతోపాటు ఒంటిగుడిసె తండా, చిన్నగుట్టతండా, రేగడిపట్టతండా, తుమ్మలకుంటతండా, సామగడ్డతండా నిర్వాసితులకు దశల వారీగా రూ.250 కోట్ల ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారాన్ని బాధితుల బ్యాంకు ఖాతాలలో ఇప్పటికే జమ చేశారు. అయితే ఉదండాపూర్‌ గ్రామానికి సంబంధించి మాత్రం ఆలస్యంగా సర్వే పూర్తి కావడంతో ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారానికి సంబంధించి అవార్డు పాస్‌ కాలేకపోయింది. గతంలో నిర్వహించిన సర్వేలో బోగస్‌ కుటుంబాల నమోదు ఉన్నాయన్న ఆరోపణలు, ఫిర్యాదులపై అధికారులు రీసర్వే చేపట్టారు. ఫలితంగా అవార్డు పాస్‌ కాక నిధులు విడుదల కావడంలో జాప్యం జరిగింది. ఫలితంగా ఇప్పటికీ ఉదండాపూర్‌ అవార్డు ప్రక్రియ కొలిక్కి రాలేదు. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. అవార్డు పాస్‌ అయితేనే ఆర్‌అండ్‌ఆర్‌ నిధులు విడుదల కానున్నాయి.

పెంపుపై కసరత్తు..

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉదండాపూర్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పెంపునకు కృషిచేస్తామని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆయన పలుమార్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి గత ప్రభుత్వం రూ.16.30 లక్షల ప్యాకేజీని ప్రకటించగా.. దీనిని రూ.25 లక్షలకు పెంచుతామని ఎమ్మెల్యే చెప్పారు. అయితే ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పెంపుతో ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు పాత ప్యాకేజీ ప్రకారంగానే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కాగా.. ఇటీవల ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం పెంపు కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి విన్నవించగా.. ప్రభుత్వం అదనంగా రూ.146 కోట్ల విడుదల కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు ఇదివరకే ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి వెల్లడించారు. బీఆర్‌ఎస్‌ ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం కేటాయింపులో వేర్వే రుగా ప్యాకేజీ ఖరారు చేశారు. తాజా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం తప్పని ఎదురుచూపులు

ఈనెల 9లోగా అందిస్తామన్న సీఎం.. ముగిసిన గడువు

పంచాయతీ ఎన్నికల కోడ్‌తో నిధుల విడుదలలో జాప్యం

ఆందోళనలో ఉదండాపూర్‌ నిర్వాసితులు

ఇప్పటికే ప్యాకేజీ పెంపు

ప్రకటించిన ప్రభుత్వం

రూ.18 లక్షలకు పెంపు..?

ఉదండాపూర్‌ నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం కింద ఒక్కో కుటుంబానికి రూ.16.30 లక్షల నుంచి రూ.18 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అలాగే 65 ఏళ్లు పైబడిన ఒంటరి వ్యక్తులను సైతం ఒక కుటుంబంగా పరిగణించి పరిహారం చెల్లించనున్నట్లు సమాచారం.

న్యాయం చేయాలి..

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా ఇప్పటి వరకు ప్యాకేజీ అందలేదు. గతంలోనే ప్యాకేజీ ఇచ్చి ఉంటే అప్పట్లో తక్కువ ధరలకు ప్లాట్లు, ఇతరత్రావి కొనుగోలు చేసే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పెరిగిన ధరలకు ప్రభుత్వం ఇచ్చే పరిహారం దేనికీ సరిపోదు. ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చెప్పిన విధంగా ప్యాకేజీ రూ.25 లక్షలకు పెంచి న్యాయం చేయాలి. – హన్మంతు, నిర్వాసితుడు, ఉదండాపూర్‌

పరిహారం.. పరిహాసం 1
1/1

పరిహారం.. పరిహాసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement