రైతు నెత్తిన.. నకిలీ పిడుగు
మరికల్: పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి నకిలీ విత్తనాలు.. నాసిరకం ఎరువులు జిల్లాకు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మొన్నటికి మొన్న ఎస్పీ హెచ్చరికలు జారీ చేశారు. అంతలోనే నర్వ, మద్దూరు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులో నిఘా వైఫల్యం కారణంగా విత్తనాలు నాటే సమయానికన్నా రెండు నెలలకు ముందే జిల్లాలోకి నకిలీ పత్తి విత్తనాలు వచ్చేశాయి. కొందరు వ్యాపారులు ముఠాగా ఏర్పడి అధికారుల కళ్లు కప్పి రహస్యంగా జిల్లాకు నకిలీ పత్తి విత్తనాలతో పాటు ప్రమాదకారమైన గ్‌లైకాసిన్ కలుపు నివారణ (గడ్డి పిచికారి) మందులను ఇక్కడి వ్యాపారులకు చేరవేశారు. ఇందుకు నిదర్శనం ఈ నెల 10న టాస్క్‌ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడిలో నర్వ, మద్దురు మండలాల్లో నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడడమే. ఇప్పటికే 50 శాతానికి పైగా జిల్లాలో ఈ విత్తనాలు చేరినట్లు సమాచారం. వీటిని కొనుగోలు చేసిన రైతులు తమ పొలాలు, గడ్డివాములు, పశువుల కొట్టలో, భూమిల్లో ప్లాస్టిక్ కవర్‌లో భద్రపరుస్తున్నారు.
5 క్వింటాళ్ల విత్తనాల పట్టివేత
కర్ణాటక వ్యాపారులతో సంబంధాలు ఉన్న కొందరు పత్తి విత్తన వ్యాపారులు కర్ణాటకలోని రాయచూర్, యాద్గీర్, గుల్బర్గా తదితర ప్రాంతాల నుంచి రాత్రి సమయంలో గుట్టుగా నకిలీ విత్తనాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఈ విత్తనాలను రహస్యంగా వ్యవసాయ పొలాల వద్ద భద్ర పరుస్తున్నారు. జిల్లాకు దిగుమతి అయిన నకిలీ పత్తి విత్తనాల విషయం తెలుసుకున్న రెండు మండలాల్లోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు వరుస దాడులు నిర్వహించగా రెండు రోజుల వ్యవధిలోనే నర్వలో 2 కింటాళ్లు, మద్దూరులో 3 క్వింటాళ్ల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. ఈమేరకు కేసులు నమోదు చేశారు. ఇదిలాఉండగా, ఇప్పటికే కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో నకిలీ పత్తి విత్తనాలు జిల్లాకు వచ్చాయని, ప్రతి ఏడాది తమ వద్దకు వచ్చే రైతులకు నేరుగా పొలాల వద్దకు వెళ్లి వ్యాపారులు విత్తనాలు విక్రయించారని సమాచారం. ఈ వ్యవహారం అంతా విత్తనాలు వచ్చిన వారం రోజుల్లో ఎవరికీ అనుమానం రాకుండా చేరవేస్తారని తెలిసింది.
జిల్లాలో 60 శాతం
నకిలీ పత్తి విత్తనాలను ఇక్కడి రైతులకు పరిచయం చేసింది ఆంధ్రా వ్యాపారులు. వీరు పత్తి సాగు కోసం పొలాలను కౌలుకు తీసుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధించడం చూసిన ఇక్కడి రైతులు వాటి వైపు ఆకర్శితులయ్యారు. ఇలా ఆంధ్రా వ్యాపారులు ఇక్కడి రైతులకు వాటిని అందజేయడంతో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 60 శాతం రైతులు నకిలీ విత్తనాలతో పంటలు సాగు చేస్తున్నారు. వీటితో సాగు చేయడం వల్ల కొంతమంది రైతులు ప్రమాదకారమైన వ్యాధుల భారిన పడ్డారు.
పోలీసుల సూచనలు
రైతులు ఎవరైనా పత్తి విత్తనాలు కొనుగోలు చేసే ముందు గుర్తింపు పొందిన కంపెనీ ప్యాకింగ్, లేబుల్ తనిఖీ చేసుకోవాలి.
విడి విత్తనాలు, నాసిరకం పిచికారీ మందులతో ప్రాణాలకు ప్రమాదం.
గ్రామాల్లోకి వచ్చి విడి విత్తనాలు అమ్మే వ్యాపారులను, మధ్యవర్తులను నమ్మొద్దు.
ప్రభుత్వ గుర్తింపు పొందిన విత్తన ఫర్టిలైజర్ దుకాణాలు, వ్యాపారుల నుంచి మాత్రమే విత్తనాల కొనుగోలు చేయాలి.
నకిలీ విత్తనాలు, ఎరువులు అమ్మే వ్యాపారులపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తాం.
విడి విత్తనాలు విక్రయించేవారు గ్రామాల్లోకి వస్తే 100కి డయల్ చేయాలి.
మార్చిలోనే జిల్లాలోకి చేరిన నకిలీ పత్తి విత్తనాలు
నర్వ, మద్దూరు మండలాల్లో ఇటీవల పట్టివేత
రాష్ట్ర సరిహద్దులో నిఘా వైఫల్యం
చక్రం తిప్పుతున్న కొందరు వ్యాపారులు
కఠిన చర్యలు తీసుకుంటాం
కర్ణాటక నుంచి తెచ్చిన నకిలీ పత్తి విత్తనాలు, నాసిరకం ఎరువులను రైతులకు అమ్ముతే పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులో పటిష్ట నిఘా ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేయిస్తున్నాం. అనుమానిత వ్యాపారులతో, రైతులతో ఉన్న నకిలీ విత్తనాలు, నాసిరకం ఎరువులను గుర్తించి సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం. గ్రామాల్లో ఎవరైనా విడి విత్తనాలు అమ్మేందుకు వస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలి. – యోగేష్ గౌతమ్, ఎస్పీ
రైతు నెత్తిన.. నకిలీ పిడుగు


