ఇదే స్ఫూర్తి కొనసాగించండి
నారాయణపేట: జిల్లాలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు విజయఢంకా మోగించారని, ఇదే స్ఫూర్తితో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కంకణబద్దులై కృషి చేయాలని.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మన అభ్యర్థులను గెలిపించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాలో బీజేపీ మద్దతుదారులుగా విజయం సాధించిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులకు బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన సన్మాన సభలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని వారిని ఘనంగా సన్మానించి అభినందించారు. ముందుగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి చిత్ర పటానికి నివాళులు ఎంపీ అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలో గతంలో పదేళ్లుగా పాలన అందించిన బీఆర్‌ఎస్‌పై ప్రజలు కోపం వచ్చి కాంగ్రెస్‌కు పట్టం కట్టారని.. సీఎం రేవంత్‌రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలుపర్చడంలో పూర్తిగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, జీపీలకు కేంద్ర నిధులు తప్పా కాంగ్రెస్ ప్రభుత్వల నుంచి పైసా రాలేదన్నారు. చేసిన పనులకు బకాయిలు రాక గత సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. డబ్బులు లేవని సీఎం స్వయంగా చెబుతున్నారన్నారు. రెండేళర్ల పాలనలో కాంగ్రెస్ వైఫల్యాలను గ్రామ గ్రామాన ఎండగట్టడంతో పాటు.. కేంద్ర పథకాలు వివరించాలన్నారు. బీజేపీ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరికీ వర్క్ షాప్ త్వరలో వర్క్ షాప్ నిర్వహిస్తామన్నారు. త్వరలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి మరింత బలంగా పని చేయాలన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యేలను గెలిపించుకోవడానికి ఇప్పటి నుంచే పని చేయాలన్నారు. ఒక్కసారి తెలంగాణలో అధికారంలోకి బీజేపీ వస్తే దించే సత్తా ఏ పార్టీకి లేదని, ప్రజలే మళ్లీ గెలిపించుకుంటారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగురావు నామాజీ, రతంగ్ పాండు రెడ్డి, సత్య యాదవ్, పగడకుల శ్రీనివాసులు, కొండయ్య, ప్రతాప్ రెడ్డి, లక్ష్మీకాంత్ రెడ్డి, డోకూరు తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


