వరి క్వింటా రూ.2,480
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం క్వింటా వరికి (హంస)గరిష్టంగా రూ.2480, కనిష్టంగా రూ.2030 ధర పలికింది. అలాగే, వరి (సోనా) గరిష్టంగా రూ.2,789, కనిష్టంగా రూ.2,200, ఎర్ర కందులకు గరిష్టంగా రూ.7,680, కనిష్టంగా 5,600, తెల్ల కందులకు గరిష్టంగా రూ.7,680, కనిష్టంగా రూ.6,200 ధరలు పలికాయి.
27న అర్చక సంఘం
ఉమ్మడి జిల్లా సమావేశం
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రం సింహగిరిలోని లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మండపంలో ఈనెల 27న దూపదీప నైవేద్య అర్చక సంఘం ఉమ్మడి జిల్లా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రవికుమార్ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా కార్యవర్గ సభ్యులతో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవశర్మ ఉదయం 10గంటల నుంచి 11గంటల వరకు ముఖాముఖి సమావేశం ఉంటుందని, 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30గంట వరకు అర్చకులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల దూపదీప నైవేద్య అర్చకులు ఉదయం 11 గంటల్లోగా కల్యాణ మండపానికి చేరుకోవాలని కోరారు. సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో అర్చక చైతన్యయాత్ర ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ఉంటుందని తెలిపారు.
‘పోరాటాలకు
సిద్ధం కావాలి’
వనపర్తిటౌన్: రాష్ట్రంలో ప్రభుత్వాలు మారుతున్నా.. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.జంగయ్య ఆరోపించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని టీఎన్జీవో భవనంలో సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్.రవిప్రసాద్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన జిల్లా కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం జరగగా.. ఆయనతో పాటు జిల్లా విద్యాధికారి అబ్దుల్ ఘనీ ముఖ్యఅతిథులుగా హాజరై టీఎఫ్‌ఐ, టీఎస్‌టీయూఎఫ్ జెండాలను ఆవిష్కరించారు. జంగయ్య మాట్లాడుతూ.. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని.. కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, రెండేళ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు కాలేదని విస్మయం వ్యక్తం చేశారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, డీఈఓ, డిప్యూటీ డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముఖ్యఅతిథిగా హాజరైన డీఈఓ అబ్దుల్ ఘనీ మాట్లాడుతూ.. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి ఉపాధ్యాయులు కృషి చేయాలని, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలని, పదోతరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించే లా ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. సంఘం నాయకులు కె.జ్యోతి, బి.వెంకటేష్, తిమ్మప్ప, శ్రీనివాస్‌గౌడ్, అరుణ, ఆర్.రామన్‌గౌడ్, మురళి, రాముడు, అగ్రిప్ప, రియాజ్, చెన్నకేశవులు, జి. కృష్ణ, అనసూయా, జనవిజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి బి.నరేందర్ పాల్గొన్నారు.


