ఓపెన్ స్కూల్ పరీక్షలు ప్రారంభం
నారాయణపేట రూరల్: సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా చదువుకుంటున్న విద్యార్థులకు ఆదివారం వార్షిక పరీక్షలు ప్రారంభం అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ టెన్త్ కొరకు 573 మంది, ఓపెన్ ఇంటర్‌కు 940మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో తొలిరోజు ఉదయం జరిగిన తెలుగు, కన్నడ, తమిల్, ఉర్దూ, హిందీ పరీక్షకు గాను టెన్త్ విద్యార్థులు 508కి 435మంది హాజరుకాగా.. 73మంది గైర్హాజరు అయ్యారు. అదేవిధంగా ఇంటర్‌లో 769మందికి 709మంది హాజరుకాగా.. 60మంది గైర్హాజరు అయ్యారు. మొత్తంగా టెన్త్‌లో 86శాతం, ఇంటర్‌లో 92శాతం హాజరు నమోదైంది. అదేవిధంగా మధ్యాహ్నం నిర్వహించిన టెన్త్ వారికి హిందీ పరీక్షను డీవీఎం, గర్‌ల్స్ స్కూల్ పాఠశాలల్లో నిర్వహిస్తే ఇద్దరికి గాను ఒకరు మాత్రమే హాజరయ్యారు. అదేవిధంగా ఇంటర్ విద్యార్థులకు ఫిజిక్స్ పరీక్షను శ్రీసాయి, కృష్ణవేణి, శ్రీనారాయణ, లిటిల్‌స్టార్ కేంద్రాల్లో ఏర్పాటు చేయగా ఏడుగురికి ఒకరు గైర్హారు అయ్యి ఆరుగురు పరీక్ష రాశారు. శ్రీసాయి పరీక్షకేంద్రంలో ముగ్గురు. శ్రీనారాయణ సెంటర్‌లో ఇద్దరిని కేటాయించగా ఐదుగురు హాజరు కావడంతో వందశాతం హాజరు నమోదైంది. పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్ స్కాడ్ బృందం, టాస్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాస్‌లు పరిశీలించారు.


