రూరల్ పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న ఎమ్మెల్యే, ఎస్పీ
నారాయణపేట రూరల్: శాంతి భద్రతల పరిరక్షణకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. నారాయణపేట రూరల్ పోలీసు స్టేషన్ భవన నిర్మాణానికి సోమవారం అప్పక్‌పల్లి గ్రామ సమీపంలో ఎస్పీ ఎన్.వెంకటేశ్వర్లుతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం చిన్న జిల్లాల ఏర్పాటుతో పాటు, మండలాల విస్తరణ చేపట్టారని, పోలీసులపై ఒత్తిని అధిగమించడానికి టౌన్, మండలానికి కలిపి ఒకటిగా ఉన్న పోలీస్ స్టేషన్‌కు అదనంగా రూరల్ పీఎస్‌ను మంజూరు చేయించామన్నారు. దీంతో పోలీసులకు పనిభారం తగ్గడంతో పాటు ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడినట్లు అయ్యిందన్నారు. ఫిర్యాదు చేయడానికి సైతం దూరభారం తగ్గుతుందని, చుట్టుపక్కల 21 గ్రామాలకు ఇక్కడి నుంచే సేవలు అందుతాయని అన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణ మరింత సులువుగా ఉంటుందని, ఉద్యోగుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సీఐ రవిబాబు, ఎస్‌ఐ సురేష్‌గౌడ్, ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు సుగంధమ్మ, వెంకటమ్మ, ఎంపీటీసీ శేఖర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు వేపూరి రాములు, డీఈ బాలాజి, ఏఈ సాయికిరణ్, పోలీసులు పాల్గొన్నారు. అదేవిధంగా మండలంలోని చిన్నజట్రంలో రూ.10లక్షల సీడీపీ నిధులతో కమ్యూనిటీ భవనం నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం సింగారం చర్చి వద్ద నిర్మించిన నూతన వంటగది, భోజనశాల షెడ్‌ను ప్రారంభించారు.
అప్పక్‌పల్లి సమీపంలోరూరల్ పోలీసు స్టేషన్ నిర్మాణం


