‘సవాయిగూడెం’లో ఓటు చోరీ..!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వనపర్తి జిల్లాలో ఓటు చోరీకి సంబంధించిన ఓ కేసును జిల్లా కోర్టు విచారణకు స్వీకరించింది. వనపర్తి మండలం సవాయిగూడెం గ్రామంలో ఓటర్ లిస్టులో చనిపోయిన వారు ఉన్నారని.. వలస వెళ్లిన వారు డబుల్ ఓటర్లుగా ఉన్నారని పలువురు గ్రామస్తులు జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌తో పాటు రాష్ట్ర, జాతీయ ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. వారిని తొలగించాలని రెండేళ్ల నుంచి ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన అధికారులు గ్రామంలోని 65 మంది పేర్లను ఓటర్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలను పాత ఓటర్ లిస్టు ప్రకారమే నిర్వహించారు. దీనిపై గ్రామానికి చెందిన మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు జిల్లా కోర్టులో పిల్ వేశారు. విచారణకు స్వీకరించిన కోర్టు.. జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వో తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ బాక్స్, సామగ్రి అంతా కోర్టుకు సమర్పించాలని సూచించడం చర్చనీయాంశంగా మారింది.
5 ఓట్ల తేడాతో
కాంగ్రెస్ మద్దతుదారు గెలుపు..
పంచాయతీ ఎన్నికల్లో అధికారులు వెల్లడించిన జాబితా ప్రకారం గ్రామంలో మొత్తం 2,201 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామంలో రెండో విడతలో డిసెంబర్ 14న పోలింగ్ జరిగింది. మొత్తం 10 వార్డులు ఉన్నాయి. సర్పంచ్‌గా కాంగ్రెస్ మద్దతుదారు యామిని, బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి శ్రీలత బరిలో నిలిచారు. శ్రీలతకు 913 ఓట్లు రాగా.. యామినికి 918 ఓట్లు వచ్చాయి. దీంతో యామిని ఐదు ఓట్లు తేడాతో గెలుపొందారు. మొత్తంగా 1,882 ఓట్లు పోల్ కాగా.. యామినికి 918, శ్రీలతకు 913, నోటాకు 12 రాగా.. 39 ఓట్ల చెల్లలేదు.
వందకు పైగా
దొంగ ఓట్లు వేయించారు..
గ్రామంలో వందకు పైగా దొంగ ఓట్లు ఉన్నాయని.. పోలింగ్ రోజు పేర్లు తొలగించిన వారి స్థానంలో పలువురు ఓటు వేసేందుకు రాగా అభ్యంతరం తెలిపినట్లు గ్రామస్తులు వెల్లడించారు. అయినా అధికార కాంగ్రెస్ నేతల అండదండలతో పోలీసులు బందోబస్తు మధ్య వారితో ఓటు వేయించారని చెబుతున్నారు. ఈ దొంగ ఓట్లతోనే తాము ఓటమి పాలైనట్లు సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన పలువురు తెలిపారు. ఇది ముమ్మాటికీ ఓటు చోరేనని.. ఓటు చోరీ గురించి గగ్గోలు పెడుతున్న కాంగ్రెస్ నేతలు దీనిపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు. దొంగ ఓట్లతో గెలిచిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలని.. సవాయిగూడెం ఎన్నికలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ఓటు చోరీకి సంబంధించి ఇది రాష్ట్రంలో నమోదైన మొదటి కేసు అని చెబుతున్నారు.
పంచాయతీ ఎన్నికల్లోదొంగ ఓట్లు వేశారని పిల్
విచారణకు స్వీకరించిన వనపర్తి జిల్లా కోర్టు
జిల్లా ఎన్నికల అధికారి, ఆర్డీఓ, ఆర్వోలకు నోటీసుల జారీ
8న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
బ్యాలెట్ బాక్స్, సామగ్రి సమర్పించాలని సూచన


