సిబ్బంది కేటాయింపు పూర్తి..
కనీస సౌకర్యాల కల్పన..
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి..
ఇవీ నిబంధనలు..
నేటి నుంచి పదోతరగతి వార్షిక పరీక్షలు
నారాయణపేట రూరల్: జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 8,316 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రైవేట్ విద్యార్థులకు జిల్లాకేంద్రంలోని మోడ్రన్ పాఠశాల పరీక్ష కేంద్రం కేటాయించారు. ఏ కేటగిరి పరీక్ష కేంద్రాలు 17, బి కేటగిరి కేంద్రాలు 17 ఉన్నాయి. 9 కేంద్రాలు సి కేటగిరిలో ఉండటంతో ఒక్కో సీ–కస్టోడియన్‌తో పాటు ఒక వాహనం ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల స్టోరేజ్ పాయింట్లకు 10 పోలీస్‌స్టేషన్లను కేటాయించారు. రోజు ఉదయం 9.30 నుంచి 12.30 వరకు పరీక్ష జరగనుండగా.. అరగంట ముందే కేంద్రంలోకి విద్యార్థులను అనుమతిస్తారు. అయితే ఐదు నిమిషాలు గ్రేస్ టైమ్‌గా నిర్ధారించి 9.35 తర్వాత వచ్చిన వారిని అనుమతించరు.
పరీక్షల నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకం శుక్రవారం వరకు కొనసాగింది. జిల్లావ్యాప్తంగా 43 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 43 మంది డిపార్ట్‌మెంట్ అధికారులను నియమించి వారికి రెండు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. సుమారు 380 మంది ఇన్విజిలేటర్లుగా వ్యవహరించనున్నారు. జిల్లా నోడల్ అధికారి డీఈఓతో సహా మరో పది సిట్టింగ్, ఒక ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను ఏర్పాటు చేశారు. పరీక్ష సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి ఉంచడంతో పాటు ప్రతి కేంద్రం వద్ద ముగ్గురు పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ఎంఈఓలు, కస్టోడియన్‌లు దృష్టి సారించారు. తాగునీరు, ఫర్నీచర్, మరుగుదొడ్లు తదితర వాటిని సమకూర్చారు. విద్యుత్ సౌకర్యంతో పాటు వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనం కల్పించేందుకు ఫ్యాన్లు ఏర్పాటు చేయించారు. సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ వినియోగంపై సందిగ్ధత నెలకొంది. విద్యాశాఖ ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్ ఏర్పాటు చేసింది. సందేహాలు, సలహాలు, సూచనలకు
86397 15158 సంప్రదించాలని సూచించారు.
జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు..
8,316 మంది విద్యార్థులు
జిల్లాలో ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు
ఐదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
పదోతరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన వసతులు కల్పించాం. సీసీ కెమెరాలను అవసరం మేరకు ఉపయోగిస్తాం. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలి. ఎలాంటి భయాందోళనకు గురికావద్దు.
– శశికుమార్,
జిల్లా పరీక్షల విభాగం అధికారి
పరీక్ష కేంద్రానికి అరగంట ముందు చేరుకోవాలి
ప్రైవేట్ విద్యార్థులు యూనిఫామ్ ధరించరాదు.
సెల్‌ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులకు అనుమతి లేదు.
హాల్‌టికెట్, ప్యాడ్‌తో పాటు వాటర్‌బాటిల్, చేతి రుమాలు వెంట తెచ్చుకోవాలి.
వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్‌తో పరీక్షకు హాజరుకావచ్చు


