జిల్లాలో వంట గ్యాస్‌ కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో వంట గ్యాస్‌ కొరత లేదు

Mar 15 2026 6:16 AM | Updated on Mar 15 2026 6:16 AM

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌

ఫణింధర్‌రెడ్డి

నారాయణపేట: జిల్లాలో గృహ, విద్యాలయాలు, ఆస్పత్రులకు అవసరమైన ఎల్‌పీజీ సరఫరాకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని.. వంట గ్యాస్‌ సిలిండర్లకు కొరత లేదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఫణింధర్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనుతో కలిసి గ్యాస్‌ ఏజెన్సీ డీలర్లు, గ్యాస్‌ కంపెనీల సేల్స్‌ అధికారులు, పౌరసరఫరాలశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గ్యాస్‌ బుకింగ్‌, నిల్వలు, సరఫరాకు సంబంధించి రోజువారీగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. డొమెస్టిక్‌ గ్యాస్‌ సిలిండర్ల కొరత లేదని ఈ సందర్భంగా ఆయిల్‌ కంపెనీల సేల్స్‌ అధికారులు వివరించారు. యుద్ధం కారణంగా రాష్ట్రంలో చమురు, ఎల్పీజీ గ్యాస్‌ కొరత ఏర్పడినట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, జిల్లా ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆస్పత్రులు, విద్యాసంస్థలకు చెందిన వసతి గృహాలు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలకు ప్రభుత్వ నిబంధనల మేరకు సరఫరా చేయాలని ఆదేశించారు. డొమెస్టిక్‌ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగించినా, నిల్వ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. పౌర సరఫరాలశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు హోటళ్లు, రెస్టారెంట్లను తనిఖీ చేస్తాయని చెప్పారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి బాలరాజు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్‌ సైదులు, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ అబ్దుల్‌ ఖలీల్‌, మైనార్టీ సంక్షేమశాఖ అధికారి ఎంఏ రషీద్‌, డీలర్లు భీమయ్యగౌడ్‌, శాంతకుమార్‌, అశోక్‌, ఉదయ్‌, దత్తాత్రేయ, భాస్కర్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement