తొలిరోజు ప్రశాంతం | - | Sakshi
Sakshi News home page

తొలిరోజు ప్రశాంతం

Mar 15 2026 6:16 AM | Updated on Mar 15 2026 6:16 AM

జిల్లాలో ప్రారంభమైన

పదోతరగతి పరీక్షలు

99.8 శాతం హాజరు నమోదు

నారాయణపేట రూరల్‌: జిల్లాలో శనివారం పదోతరగతి వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ భాష పరీక్షకు మొత్తం 43 కేంద్రాల్లో 8,319 మంది విద్యార్థులకుగాను 8,306 మంది పరీక్ష రాయగా.. 13 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాకేంద్రంలోని మాడ్రన్‌ పాఠశాల కేంద్రంలో ప్రైవేట్‌ విద్యార్ధుల్లో ముగ్గురికి ముగ్గురు హాజరయ్యారు. మొదటిరోజు 99.8 హాజరు శాతం నమోదైంది.

అధికారుల తనిఖీ..

పట్టణంలోని బ్రిలియంట్‌, లిటిల్‌స్టార్స్‌ పాఠశాల పరీక్ష కేంద్రాలను రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీను తనిఖీ చేశారు. కేంద్రాల్లో కనీస సౌకర్యాలైన ఫ్యాన్లు, లైట్లు, మరుగుదొడ్ల ఏర్పాటు, వైద్య సహాయ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సాఫీగా నిర్వహించాలని ఆదేశించారు. అదేవిధంగా పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాధికారి గోవిందురాజు తనిఖీ చేశారు. ఫ్లయింగ్‌స్కాడ్‌ బృందంతో పాటు పది కేంద్రాల్లో సిట్టింగ్‌ స్కాడ్‌ బృందాలు విధులు నిర్వర్తించాయి. సీఐ శివశంకర్‌ పలు కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. గుర్తింపుకార్డు లేని వారిని లోనికి అనుమతించరాదని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement