నయా సాల్.. ఫుల్ జోష్!
● రికార్డు స్థాయిలో రూ.5.50 కోట్ల మద్యం అమ్మకాలు
● కిటకిటలాడిన చికెన్, మటన్ దుకాణాలు
● జిల్లాలో 86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
నారాయణపేట: కొత్త సంవత్సర సంబరాలు మందుబాబుల్లో ఫుల్ జోష్ నింపాయి. ఒక్క రోజులోనే రూ.5.50 కోట్ల మేర మద్యం అమ్మకాలు జరిగాయి. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026కు గ్రాండ్ వెల్‌కమ్ పలికారు. జిల్లాలోని 33 వైన్స్ దుకాణాల్లో మద్యం ప్రియులు బీర్లు, వైన్‌ల కోసం బారులు తీరారు. నారాయణపేట సర్కిల్ పరిధిలో వైన్స్‌లతో పాటు బెల్డ్ దుకాణాల్లో రూ.3.50 కోట్లు.. సీఎం ఇలాఖాలోని 14 వైన్స్లు, ఒక బారు, బెల్ట్ దుకణాల్లో రూ.కోటిన్నర విక్రయాలు జరిగాయని ఎకై ్సజ్ శాఖ అంచనా వేస్తోంది. మద్యం ప్రియుల జేబులు గుల్ల అయినా.. ప్రభుత్వ ఖజానా మాత్రం గలగలలాడింది. ఇదిలాఉండగా, యువత హోటళ్లు, దాబాలు, రిసార్ట్స్‌కు వెళ్లి వేడుకలు జరుపుకొన్నారు. రాత్రి 12 అవగానే కేరింతలు కొడుతూ నూతన సంవత్సరానికి ఘన స్వాగతం తెలిపారు. హాపీ న్యూ ఇయర్ అంటూ గంతులేశారు.
రెండు రోజుల ముందు నుంచే..
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మద్యం ప్రియుల అభిరుచులకు అనుగుణంగా వారికి కావాల్సిన బ్రాండ్లను వైన్స్‌ల్లో అందుబాటులో ఉంచారు. డిసెంబర్ 28 నుంచే అన్ని సాధారణ రోజుల కంటే 20 నుంచి 40 శాతం అధికంగా మద్యం స్టాక్ వైన్స్, బార్లకు చేరుకున్నాయి. ఒక వైన్స్‌లో 31న ఒక్కరోజు ఉన్న స్టాక్ మొత్తంలో 60శాతం వరకు మద్యం అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. వీటికితోడు దాబాలు, హోటళ్లు కిటకిటలాడాయి. డిసెంబర్ 31 రాత్రి కేక్ కట్ చేయడం నుంచి మద్యం సేవించడం, భోజనాలకు ఏర్పాట్లు చేశారు. ఇక చికెన్, మటన్ విక్రయాలతో షాపులు పొద్దున్నుంచే కిటకిటలాడాయి. కాల్చిన కూర, చికెన్ ఫ్రై, చేపల ఫ్రై వద్ద జనం బారులు తీరి కనిపించారు. సాధారణ రోజులతో పోలిస్తే డిసెంబర్ 31న మాంసం విక్రయాలు జోరందుకున్నాయి.
ముమ్మర తనిఖీలు.. 86 డ్రంకెన్ డ్రైవ్ కేసులు
జిల్లాలో నూతన సంవత్సరం సందర్భంగా రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం 6 గంటల వరకు జిల్లా పరిధిలోని 12 పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాల తనిఖీలలో మొత్తం 86 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. జిల్లాలోని పీఎస్‌ల వారీగా పరిశీలిస్తే నారాయణపేట టౌన్ 14, దామరగిద్ద 8, కోస్గి 5, మద్దూర్ 4, మరికల్ 7, ధన్వాడ 15, నర్వ 15, మక్తల్ 5, కృష్ణా 4, మాగనూర్ 8 నారాయణపేట రూరల్‌లో 1 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయి. మద్యం సేవించి వాహనాలు నడిపితే ప్రాణాలకు ప్రమాదమని, అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, మద్యం సేవించిన తరువాత వాహనం నడపకూడదని ఆయన సూచించారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
నయా సాల్.. ఫుల్ జోష్!


