లక్ష్య సాధనకు కృషి చేయాలి
నారాయణపేట రూరల్: తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేరుస్తూ నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు విద్యార్థులు కృషి చేయాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను అన్నారు. పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థినులతో మాట్లాడారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు, పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా చదవాలని, అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలన్నారు. శీతాకాలం సందర్భంగా చలి నుంచి తట్టుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అనారోగ్య సమస్యలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. అంతకుముందు పాఠశాలలో ని వసతులు, భోజనం తదితర అంశాలపై విద్యార్థులని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ పరీక్ష ప్యాడ్, నోటు పుస్తకాలను అందించారు. కార్యక్రమంలో ఏవో శ్రీధర్, తహసీల్దార్, ప్రిన్సిపాల్ యాదమ్మ, ఎస్‌ఓ శ్వేతాజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
తెల్లకందులుక్వింటా రూ.7,866
నారాయణపేట: స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం తెల్ల కందులు క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,866 , కనిష్టంగా రూ.6,216 ధర పలికింది. అలాగే, ఎర్ర కందులు గరిష్టంగా రూ.7,759, వడ్లు (సోన) గరిష్టంగా రూ.2,711, కనిష్టంగా రూ.2,260 ధర పలికాయి.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నారాయణపేట: రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి వాహనదారుడు, ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించినప్పుడే ప్రమాదాలను తగ్గించవచ్చని, నియమాలు పాటించాలని ఎస్పీ వినీత్ అన్నారు. గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏఎస్పీ రియాజ్ హుల్ హక్, డీఎస్పీ నల్లపు లింగయ్య, డిస్ట్రిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ మేగా గాంధీతో కలిసి ఎస్పీ పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. మాసోత్సవాల సందర్భంగా జిల్లా పోలీసు శాఖతో పాటు రవాణా శాఖ అధికారులు కలిసి నెల రోజుల పాటు రోడ్డు భద్రత నియమాలపై విద్యాసంస్థలు, గ్రామా లు, పట్టణాల్లో ప్రచార కార్యక్రమాలు హెల్మెట్, సీట్‌బెల్ట్ ప్రాముఖ్యతపై అవగాహన వంటివి నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.


