నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
నారాయణపేట: గతేడాది పెండింగ్‌లో ఉన్న కేసులను తగ్గించేందుకు.. ఈ ఏడాది అందరూ సమన్వయంతో పనిచేసి నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ వినీత్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా గురువారం ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ కేక్ కట్ చేశారు. ప్రజలకు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. 2025 ఎన్నో చేదు, తీపి గుర్తులతో గడిచిపోయిందని, కొత్త ఏడాది జిల్లా జిల్లా పోలీసులు కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకుని వాటిని సాధించడానికి అహర్నిశలు కృషి చేయాలని, నేరాలను తగ్గించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పనితీరు మెరుగుపరుచుకుని అద్భుతమైన ఫలితాలు సాధించాలని, గతేడాది జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా నిర్వహించినందుకు సిబ్బందిని అభినందించారు. సమస్యాత్మక కేసులను సాంకేతికతను ఉపయోగించి త్వరగా పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రియాజ్ హుల్‌హక్, డీఎస్పీ లింగయ్య, సిఐలు శివశంకర్, రాంలాల్, సైదులు తదితరులు పాల్గొన్నారు.


