నారాయణపేట రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు పనిచేయాలని డీఈఓ గోవిందరాజు అన్నారు. తపస్ మండలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మండలస్థాయి ప్రతిభ పరీక్షల్లో విజేతలకు శుక్రవారం బహుమతులు అందజేసి మాట్లాడారు. పుస్తకాల్లోని జ్ఞానం కేవలం పరీక్షల కోసమే కాకుండా జీవితాన్ని తీర్చిదిద్దడానికి వినియోగించాలన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్‌కు బంగారు బాటలు వేయాలని సూచించారు. విలువలతో కూడిన విద్యను అందించాలని, ప్రశ్నించేతత్వం అలవర్చాలని కోరారు. సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని.. ఇలాంటి పోటీ పరీక్షలను ఉపాధ్యాయ సంఘం నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారి నాగార్జునరెడ్డి, సూపరింటెండెంట్ నర్సింహారెడ్డి, తపస్ నాయకులు లక్ష్మణ్, నర్సింహులు, అశోక్ రెడ్డి, లాలప్ప, ప్రదీప్, శంకర్, చంద్రకాంత్, రాజేష్, సల్మాన్‌రాజ్, అర్చన, వెంకటయ్య, శంకర్‌సింగ్ పాల్గొన్నారు.
విజేతలు వీరే..
ప్రాథమిక స్థాయిలో 3వ తరగతి విభాగంలో శ్రీజ (ఉంటకుంటతండా) ప్రథమ, ఓంకార్ (అంత్వర్) ద్వితీయ, 5వ తరగతిలో గణేష్ (సింగారం) ప్రథమ, వర్ష (ఉంటకుంట తండా) ద్వితీయ, ప్రాథమికోన్నత స్థాయిలో 7వ తరగతి విభాగంలో మహేశ్వరి (పేరపళ్ల) ప్రథమ, రాకేష్ (ఎక్లాస్‌పూర్) ద్వితీయ, ఉన్నత పాఠశాల స్థాయిలో 7వ తరగతి వైష్ణవి (బొమ్మన్‌పాడు) ప్రథమ, సింధు (కొల్లంపల్లి) ద్వితీయ, 9వ తరగతి విభాగంలో లావణ్య (కొల్లంపల్లి) ప్రథమ, చరణ్‌తేజ (గ్రౌండ్ స్కూల్) ద్వితీయ బహుమతులు సాధించారు.


