కోస్గి రూరల్: ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చేపడుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సీడీఎంఏ అసిస్టెంట్ డైరెక్టర్, కోస్గి మున్సిపాలిటీ నోడల్ అధికారి విశాల్‌రాజ్ అన్నారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పుర కార్యాలయంలో సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఆస్తిపన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటి వరకు కేవలం 52 శాతం మాత్రమే వసూలు అయ్యాయని.. మరో పది రోజుల్లో 80 శాతానికి చేరేలా చూడాలని ఆదేశించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, అమృత్‌జల్ పనుల్లో వేగం పెంచాలని, ప్రతి వ్యాపారస్తుడికి ట్రేడ్‌లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని, మెప్మా సిబ్బంది ఉమెన్ ఫర్ ట్రీ ప్రోగ్రాంలో మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. వేసవిలో ప్రతి ఇంటికి తాగునీటిని అందించాలని కోరారు. పట్టణంలో కొనసాగుతున్న సైన్స్ మ్యూజియం, పంచతంత్ర పార్క్, డంపింగ్‌యార్డు పనులను స్వయంగా పరిశీలించారు. పనుల్లో వేగం పెంచి గడువులోకి వినియోగంలోకి తీసుకురావాలని ఆదేశించారు. అలాగే పుర పరిధిలోని మల్‌రెడ్డిపల్లి, 6వ వార్డులో డ్రైనేజీలను శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆయన వెంట పుర చైర్మన్ నాగులపల్లి నరేందర్, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, ఏఈ జ్ఞానేశ్వర్, కౌన్సిలర్లు అంజిలయ్య, నాగులపల్లి రాధిక నర్సింహులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


