నంద్యాల(వ్యవసాయం): జైలులో ఉన్న ఖైదీలు వారి హక్కుల గురించి తెలుసుకోవాలని ఆరవ అదనపు జిల్లా జడ్జి, ఫుల్ అడిషనల్ చార్జ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి.వాసు అన్నారు. గురువారం స్థానిక స్పెషల్ సబ్ జైల్‌ను ఆయన కార్యదర్శి బి.లీలావెంకట శేషాద్రిలు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మికర్రిలతో కలసి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్రిజన్ లీగల్ ఎయిడ్ హెల్ప్ డెస్క్, క్లీనిక్‌లను తనిఖీ చేసి ఖైదీలకు అవగాహన కల్పించారు. 70 ఏళ్లు వయస్సు పైబడిన, అనారోగ్యంతో బాధపడే ఖైదీలకు ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. అదే విధంగా ఖైదీలకు అందించే ఆహారం, రేషన్, వారి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కర్నూలు వారిని సంప్రదించవచ్చన్నారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్‌లైన్ నంబరు 15100కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరామచంద్రారావు, లక్ష్మీనారాయణ, జైలు సూపరింటెండెంట్ గురుప్రసాదరెడ్డి, బాలు, రామచంద్రారెడ్డి, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో
90.8 మి.మీ వర్షపాతం
నంద్యాల(అర్బన్): జిల్లాలో ఐదు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం నుంచి గురువారం ఉదయం వరకు ఆయా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. శ్రీశైలంలో మండలంలో అత్యధికంగా 90.8మి.మీ వర్షం కురవగా, బనగానపల్లె మండలంలో అత్యల్పంగా 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జూపాడుబంగ్లాలో 56.8, పగిడ్యాలలో 56.4, ఆత్మకూరులో 44.2, వెలుగోడులో 43.2, పాములపాడులో 31.2, గడివేముల 30.0, మహానంది 28.6, బండిఆత్మకూరు 23.4, అవుకు, నందికొట్కూరులో 22.6, బేతంచెర్ల 21.2, మిడుతూరు, కొత్తపల్లెలో 20.2, రుద్రవరం 19.0, ఆళ్లగడ్డ 18.6, ప్యాపిలి 17.8, శిరివెళ్ల 17.4, కొలిమిగుండ్ల 14.8, నంద్యాల అర్బన్ 14.0, నంద్యాల రూరల్ 13.2, డోన్ 12.8, ఉయ్యాలవాడ 12.6, పాణ్యం 12.4, దొర్నిపాడు 12.0, కోవెలకుంట్ల 11.2, చాగలమర్రి 10.4, సంజామల 9.0, గోస్పాడు 8.4మి.మీ వర్షం కురిసింది.
నేడు జూపాడుబంగ్లాలో పీజీఆర్‌ఎస్
నంద్యాల(న్యూటౌన్): వన్ మంత్ – ఫోర్ విజి ట్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 25వ తేదీన శుక్రవారం జూపాడుబంగ్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు, అర్జీలు, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. సంక్షేమం, అభివృద్ధి, రెవెన్యూ, పౌర సేవలు తదితర అంశాలపై వినతులు తీసుకుని పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జూపాడుబంగ్లా మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
క్వింటా ఉల్లి రూ.4,630
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం క్వింటా ఉల్లికి గరిష్ట ధర రూ.4630 లభించింది. మొత్తం 2,046 క్వింటాళ్ల ఉల్లి అమ్మకానికి వచ్చింది. క్వింటా సగటు ధర రూ.3,830 నమోదైంది. మార్కెట్‌కు 124 క్వింటాళ్ల వేరుశనగ రాగా.. కనిష్ట ధర రూ.5,089, గరిష్ట ధర రూ.9,389 లభించింది. సగటు ధర రూ.5719 నమోదైంది. మొక్కజొన్న కొరత ఎక్కువగా ఉండటంతో క్వింటా ధర రూ.2,515 పలికింది. ఆదోని మార్కెట్‌లో క్వింటా పత్తికి కనిష్ట ధర రూ.6000, గరిష్ట ధర రూ.9709 లభించింది.
స్వర్ణ పల్లకీలో
రాఘవేంద్రుడు విహారం
మంత్రాలయం: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో రాఘవేంద్రుల స్వర్ణ పల్లకోత్సవం వైభవంగా జరిగింది. గురువారం ఊంజల మంటపంలో ముందు గా రజత రాఘవేంద్రుల బృందావన ప్రతిమకు విశేష పూజలు చేపట్టారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో అశేష భక్తజన వాహిని మధ్య స్వర్ణ పల్లకీ సేవ నిర్వహించారు.


