వైఎస్ జగన్ వల్లే పీఆర్‌లో పదోన్నతులకు కదలిక
ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి
కర్నూలు(అర్బన్): పెద్దల స్ఫూర్తి, అందరి సహకారంతో మరింత పారదర్శకంగా, ఎక్కడా అవినీతికి తావు లేకుండా సేవలు అందించామని జిల్లా పరిషత్ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా పదవీ కాలం పూర్తి అయిన సందర్భంగా గురువారం స్థానిక ఎస్‌వీ రీజెన్సీలోని సమావేశ భవనంలో అధికారులు, జెడ్పీటీసీలు, సహచరులు, స్నేహితులు ఆయనకు ఘనంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ జెడ్పీటీసీ పుల్యాల నాగిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, స్వర్ణగ్రామ/ వార్డు సచివాలయాల జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు, కర్నూలు డీడీఓ అశ్వినీకుమార్, జెడ్పీ వైస్ చైర్మన్ కురువ బుజ్జమ్మతో పాటు జెడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు, జెడ్పీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే గ్రామాల్లో అనేక సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్న సమయంలోనే పంచాయతీరాజ్‌లో ఉద్యోగుల పదోన్నతులకు కదలిక వచ్చిందన్నారు. గతంలో ఎంతో మంది ఎంపీడీఓలుగానే పదవీ విరమణ చేశారన్నారు. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో అనేక మంది ఎంపీడీఓలు డీఎల్‌డీఓలుగా పదోన్నతులు పొందారని గుర్తు చేశారు. అప్పట్లో పదోన్నతుల ప్రక్రియ ప్రారంభించడం వల్ల నేడు అనేక మంది వివిధ ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారులుగా కొనసాగుతున్నారని చెప్పారు.
పాపిరెడ్డికి ఘన సన్మానం ...
ఆత్మీయ వీడ్కోలు సందర్భంగా జెడ్పీ చైర్మన్ యర్రబోతుల పాపిరెడ్డిని జెడ్పీ సీఈఓ ఆర్ సుధాకర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ ఈవీ సుబ్బారెడ్డి, ఎస్‌జీఎస్‌డబ్ల్యూ సచివాలయాల జిల్లా అధికారి టీవీ భాస్కర్‌నాయుడు, కర్నూలు డీడీఓ అశ్వినీకుమార్ తదితరులు శ్రీ వెంకటేశ్వరస్వామి జ్ఞాపికను అందించి శాలువాలు, పూలమాలలతో ముంచెత్తారు.


