● జిల్లా కలెక్టర్ రాజకుమారి
నంద్యాల(అర్బన్): చిరుధాన్యాలు సాగు చేసి రైతులు లాభాలు పొందవచ్చునని జిల్లా కలెక్టర్ రాజకుమారి అన్నారు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషన్ మిషన్‌లో భాగంగా గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో జిల్లాస్థాయి చిరుధాన్యాల మేళా, శ్రీ అన్న సామర్థ్య పెంపు శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హాజరైన కలెక్టర్ ముందుగా స్టాల్స్‌ను పరిశీలించారు. చిరుధాన్యాల వల్ల లాభాలను ప్రత్యక్షంగా రైతు ఉత్పత్తిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజలు ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్న నేపథ్యంలో చిరుధాన్యాల వినియోగం పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో పంటల వైవిధ్యాన్ని పెంచుతూ వరి సాగు విస్తీర్ణాన్ని క్రమంగా తగ్గించి చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం బయో రిసోర్స్ సెంటర్ల ద్వారా రైతులు, మహిళలకు చిరుధాన్యాల సాగు, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడు తూ చిరుధాన్యాల వినియోగాన్ని పెంచడంతో పాటు వాటి ఆధారంగా విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, మార్కెటింగ్ రంగాల్లో రైతు లు, మహిళలు, యువత మరింతగా ముందుకు రావాలన్నారు. కార్యక్రమంలో ఆర్‌ఎఆర్‌ఎస్ అసోసియేట్ డైరెక్టర్ జయలక్ష్మి, నంద్యాల డీడీఎ ఆర్.గంగాధర్ రావు, మెప్మా పీడీ వెంకటదాసు, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్ రెడ్డి, డీపీఎం వై.శ్రీనివాసులు, నాబార్డు డీడీఎం కార్తీక్, ఎల్‌డీఎం అయ్యపురెడ్డి, ఏపీఎఫ్‌పీఎస్ జోనల్ మేనేజర్ రవికిరణ్, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.


