హైకోర్టు శాశ్వత బెంచ్‌ను
● సీఎం చంద్రబాబుకు న్యాయవాదుల అల్టిమేటం ● కర్నూలులో భారీ బైక్ ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట నిరసన ● మద్దతు తెలిపిన ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు
కర్నూలు(సెంట్రల్): కర్నూలులో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తావా లేదంటే మా చావులను చూస్తావా అంటూ న్యాయవాదులు సీఎం చంద్రబాబునాయుడుకు అల్టిమేటం జారీ చేశారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ అంటూ 2014 నుంచి కనీసం వందసార్లు అబద్ధాలు ఆడుతూ వస్తున్నారని, సిగ్గు అనిపించడంలేదా అని ప్రశ్నించారు. బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు కర్నూలులో బైక్ ర్యాలీ నిర్వహించారు. కోర్టు భవనం సముదాయం నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీకి ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి. దీంతో రోడ్లన్నీ స్తంభించి పోయాయి. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రుడు, ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, సీనియర్ న్యాయవాదులు నాగలక్ష్మీదేవి, వై.జయరాజు, మురళీ మాట్లాడుతూ.. శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు. హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేస్తానని ఎన్నికల ముందు టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. 2014 ఎన్నికల ముందు కూడా ఇదే హామీ ఇచ్చి కాలం గడిపారని గుర్తు చేశారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు కాలం వెళ్లదీస్తుండడంతో ఉద్యమాలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. ప్రభుత్వం దిగి వచ్చి హైకోర్టు సర్క్యూట్ బెంచ్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పడం దారుణమన్నారు. సర్క్యూట్ బెంచ్‌తో ఏమి చేసుకోవాలని ప్రశ్నించారు. శాశ్వత హైకోర్టు బెంచ్‌ను కర్నూలులో ఏర్పాటు చేయకపోతే పోరాటాలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో రాయలసీమ విద్యావంతుల వేదిక నాయకుడు రత్నం ఏసేపు విజయభాస్కరరెడ్డి, రైతు కూలీ సంఘం నాయకుడు సుంకన్న, ఎస్‌డీపీఐ నాయకుడు చాంద్‌బాషా, బుడగ జంగాల నాయకుడు తూర్పాటి మనోహర్, సీపీఎం నాయకుడు పుల్లారెడ్డి, సీపీఐ నాయకుడు రామకృష్ణారెడ్డి, బీసీ సంక్షేమ సంఘం నాయకుడు నక్కలమిట్ట శ్రీనివాసులు, రిటైర్డ్ ప్రొఫెసర్ మన్సూర్ రెహమాన్ పాల్గొన్నారు.


