ఆస్పరి: కరెంట్ కోతతో ఉక్కపోతకు ఇంట్లో ఉండలేక రాత్రి పూట అంధకారంలో బయటకు వచ్చిన మహిళ పాముకాటుకు గురయ్యారు. ప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఈ దుర్ఘటన గురువారం రాత్రి హలిగేర గ్రామంలో చోటుచేసుకుంది. అస్పరి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఐదు రోజులుగా రాత్రి పూట విద్యుత్ కోతలు విధిస్తున్నారు. గురువారం రాత్రి హలిగేర గ్రామంలో కరెంట్ పోయింది. ఉక్కపోత తాళలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కీర్తన అనే మహిళను రక్త పింజరి పాము కాటు వేసింది. గ్రామస్తులు రక్త పింజరిని చంపేసి కీర్తనను ఆదోనిలోని ఒక ప్రవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మండలంలోని 27 గ్రామాల్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విద్యుత్ కోతలు విధిస్తున్నారని ప్రజలు తెలిపారు.


