పత్తికొండ: ప్రేమ వివాహం చేసుకున్న యువకుడిపై అమ్మాయి తరఫున బంధువులు దాడి చేయడంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పత్తికొండలో యువకుడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. అందోళనను కవరేజ్ చేయడం కోసం వెళ్లిన జర్నలిస్టులపై అర్బన్ సీఐ జయన్న రాయలేని భాషలో దూషణకు దిగారు. అంతటితో ఆగకుండా రిపోర్టర్ నాగరాజును మెడ పట్టుకొని బయటకు తోశాడు. దీంతో జర్నలిస్టు సంఘాల నాయకులు ఆగ్రహం చెందారు. పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాలు, జర్నలిస్టు యూనియన్ నాయకులు రాజాసాహెబ్, సాలురంగడు, నాగరాజు, రంగన్న మాట్లాడారు. పత్తికొండ పోలీస్‌స్టేషన్ ఏర్పడిన సమయం నుంచి ఎంతో మంది అధికారులు వచ్చారని, అందరూ హుందాగా వ్యవహరించారన్నారు. చట్టం ఏమిచెబుతుందో మరచిపోయి సీఐ జయన్న వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్‌కు రావాలంటే సామాన్యులు భయపడే పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు వచ్చే ప్రతివారిని అసభ్య పదజాలంతో దూషించడం దారుణమన్నారు. సీఐ ఆగడాలకు అడ్డుకట్ట వేయకపోతే ఎస్పీ కార్యాలయం ఎదుట దీక్ష చేస్తామన్నారు. జర్నలిస్టులు మధుబాబు, రాముడు, మంజునాథ్, నాగరాజు, షపీ, ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు.


