కర్నూలు(అగ్రికల్చర్): ట్రాన్స్‌కో, డిస్కమ్‌లలో అభివృద్ధి, సాంకేతిక అంశాల్లో పురోగతి సాధించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్ సూచించారు. శుక్రవారం విద్యుత్ భవన్‌లోని ఎస్‌ఈ చాంబర్‌లో ట్రాన్స్‌కో, డిస్కమ్‌లకు సంబంధించిన టెక్నికల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డిస్కమ్ పరిధిలోని హెచ్‌టీ సబ్ స్టేషన్‌లలో అదనపు 33 కేవీ ఫీడర్ల ఏర్పాటును ముమ్మరం చేయాలన్నారు. 132 కేవీ సబ్‌స్టేషన్, కర్నూలు నుంచి పోలీసు క్వార్టర్స్ ఫీడర్, 132 కేవీ సబ్‌స్టేషన్, ఎమ్మిగనూరు నుంచి నూతన పార్లపల్లి ఫీడర్, 220 కేవీ ఏపీ కార్బైడ్ సబ్ స్టేషన్ నుంచి 33/11 కేవీ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సబ్ స్టేషన్ వరకు నూతన ఫీడర్ల ఏర్పాటుకు అవసరమైన అంచనాలను త్వరగా సమర్పించాలని సూచించారు. అదే విధంగా ఏపీ కార్బైడ్ సబ్‌స్టేషన్‌లో ఉన్న రెండు 33 కేవీ పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని 33.5 ఎంవీఏ నుంచి 50 ఎంవీఏకు పెంచే పనులకు ఇప్పటికే అనుమతులు లభించాయని తెలిపారు. అవసరమైన ట్రాన్స్‌ఫార్మర్లు కూడా అందుబాటులో ఉన్నందున పనులు సత్వరం చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటం వల్ల విద్యుత్ ఉత్పత్తికి, డిమాండ్‌కు గణనీయమైన వ్యత్యాసం ఏర్పడటంతో అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు తక్షణం, దీర్ఘకాలిక చర్యలపై చర్చించారు. ఏపీ ట్రాన్స్‌కో ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈలు సురేష్‌కుమార్, రాజశేఖర్, చెన్నారెడ్డి, మహేష్‌కుమార్, విజయరాజు తదితరులు పాల్గొన్నారు.


