మహానంది: యథేచ్ఛగా గ్రావెల్ తవ్వకాలపై ‘సాక్షి’లో గురువారం ‘మట్టి .. కొల్లగొట్టి!’’ శీర్షికన ప్రచురితమైన కథనానికి జిల్లా మైనింగ్ శాఖ అధికారులు స్పందించారు. ఈ మేరకు నంద్యాల జిల్లా మైనింగ్ శాఖ ఏడీ వేణుగోపాల్, సిబ్బంది శుక్రవారం మహానంది మండలం బసవాపురం చెరువు పరిసరాల్లో జరుగుతున్న మట్టి తవ్వకాల వద్దకు చేరుకుని క్షేత్రస్థాయిలో పరిశీలించి వివరాలు సేకరి ంచారు. ఈ సందర్భంగా ఏడీ వేణుగోపాల్ మాట్లాడుతూ మైనింగ్‌శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. నోటీసులు జారీ చేసి వివరణ కోరిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానంది మండల రెవెన్యూ అధికారులతో మాట్లాడి అవి ప్రభుత్వ భూములా లేక ప్రైవే టు భూములా అనే వివరాలు సేకరించి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కాగా మైనింగ్ శాఖ అధికారులు వస్తున్నారన్న సమాచారం వెళ్లడంతో శుక్రవారం గ్రావెల్ తరలింపు ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడింది. మైనింగ్ శాఖతో పాటు పట్టించుకోవాల్సిన కీలక శాఖల అధికారులు అటువైపు వెళ్లకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. పేదలకు ప్రభుత్వం జీవనోపాధి కోసం ఇచ్చిన భూముల్లో మట్టిని తరలిస్తున్న వైనంపై ఎన్‌ఓసీ ఇచ్చారా..?, రైతుల అంగీకార పత్రం తీసుకున్నారా..?, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతి, ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ లాంటివి ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఓ కీలక శాఖ అధికారి నేనున్నా అంటూ భరోసా ఇచ్చి మరీ ప్రోత్సహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. మిగిలిన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు అన్ని రకాల అనుమతులు ఉన్నాయా లేదా అన్నది పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమీప పొలాల రైతులు చర్చించుకుంటున్నారు.


