కౌతాళం: దైవదర్శనానికి వచ్చి మూర్చవ్యాధితో భక్తుడు మృతి చెందాడు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉరుకుందలో చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు నగరానికి చెందిన చాకలి నరసింహ, శివమ్మ దంపతుల కుమారుడు రేవంత్ (20) తన పిన్ని కుమారుడు సురేష్‌తో కలిసి స్వామి దర్శనానికి గురువారం రాత్రి ఉరుకుందకు వచ్చాడు. స్వామి దర్శనం అనంతరం అక్కడే బస చేశాడు. శుక్రవారం తెల్లవారుజామున స్థానికంగా ఉన్న ఎల్‌ఎల్‌సీలో స్నానం కోసం దిగి ఫిట్స్ రావడంతో మునిగిపోయాడు. కాలువలో గాలించగా ఉదయం 10గంటల ప్రాంతంలో శవమై తేలాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కర్నూలు నుంచి మధ్యాహ్నం అక్కడికి వచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. మృతుని తండ్రి నరసింహ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్ కానిస్టేబుల్ దావూద్‌బాషా తెలిపారు.
యానిమల్ యాక్ట్ కింద ముగ్గురు అరెస్ట్
ఎమ్మిగనూరురూరల్: మొసలిని హింసించిన కేసులో యానిమల్ యాక్ట్ కింద ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు ఆదోని ఫారెస్ట్ రేంజ్ అధికారిణి తేజస్వి పేర్కొన్నారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. నందవరం మండలం నాగలదిన్నె సమీపంలో తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం తగ్గటంతో మొసలి బయటకు వచ్చిందన్నారు. నది దగ్గర ఉన్న సి.బెళగల్ మండలం తిమ్మనదొడ్డికి చెందిన రామాంజనేయులు, నందవరం మండలం మిట్లసోమపురానికి చెందిన రామగోవిందు, సోమలగూడురుకు చెందిన తిక్కయ్య మొసలిని హింసించినట్లు సోషల్‌మీడియాలో వైరల్ అయిందన్నారు. వారిని పారెస్ట్ సిబ్బంది అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు తేజస్వి తెలిపారు. వన్యప్రాణులను హింసించినా, చంపినా శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పారు.


