3టీఎంసీలు కూడా వాడుకోలేం
ప్రశ్నిస్తారనే నీళ్లివ్వటం లేదు
● చేతకాని సీఎం హయాంలో
38టీఎంసీలు కాదుకదా
3టీఎంసీలూ వాడుకోలేం
● రాయలసీమ ప్రజలపై
ద్వేషంతోనే రాయలసీమ
లిఫ్టు భూస్థాపితం
● పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను పరిశీలించిన
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ ఎమ్మెల్యే శిల్పా, దారాసుధీర్
జూపాడుబంగ్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు రాయలసీమ ప్రాంత ప్రజలు, రైతాంగంపై ప్రదర్శిస్తున్న కక్షపూరిత ధోరణిని వ్యతిరేకిస్తూ ప్రజలు, రైతులు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త డాక్టర్ దారా సుధీర్ అన్నారు. తెగిన పోతిరెడ్డిపాడు 9వ గేటు రోప్‌ను పరిశీలించటానికి శుక్రవారం వీరు పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నారు. విషయం తెలుసుకొన్న నందికొట్కూరు రూరల్ సీఐ సుబ్రమణ్యం పోతిరెడ్డిపాడు గేట్లు మూసివేసి హెడ్‌రెగ్యులేటర్ వద్దకు వెళ్లకుండా అటకాయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకులు, సీఐకి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. చివరికి ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయనాయక్ ఐదుగురికి అనుమతివ్వాలని సీఐకి సూచించినా.. కాటసాని, శిల్పా, దారాలను మాత్రమే అనుమతించారు. నందికొట్కూరు నియోజకవర్గ పరిశీలకుడు బుడ్డా శేషారెడ్డితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులను అనుమతించకపోవటంతో గేటు వద్దే నిలిచిపోయారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ తెగిన 9వ గేటు, విరిగిన 3వ గేటు ప్లంబర్‌బ్లాక్‌ను పరిశీలించారు. అనంతరం కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ రైతాంగం సంక్షేమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 44వేల క్యూసెక్కుల నీటివిడుదలకు అనుగుణంగా 10గేట్లతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించారన్నారు. ఎస్సార్బీసీ కాల్వకు 19 టీఎంసీల నీటిని వాడుకోవాల్సిన అధికారం మనకు ఉందన్నారు. శ్రీశైలం జలాశయంలో 66 శాతం ఆంధ్రప్రదేశ్, 34 శాతం నీటిని తెలంగాణ వాడుకోవాల్సి ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇష్టం వచ్చినట్లు నీటిని వాడుకుంటున్నా చంద్రబాబు అడ్డుకోకపోవడానికి కార ణం ఏంటో బహిర్గతం చేయాలన్నారు. తెలంగాణ దుశ్చర్యలను గమనించిన మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి 840 అడుగుల నుంచే నీటిని వాడుకునేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి 90 శాతం మేర పూర్తిచేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్టును సమాధి చేసి రాయలసీమ రైతాంగానికి, ప్రజలకు తాగు, సాగునీరులేకుండా చేశారని మండిపడ్డారు.
చేతకాని సీఎం ఉన్నంత కాలం 38 టీఎంసీల నీళ్లు కాదు కదా 3 టీఎంసీలు కూడా వాడుకోలేని దరిద్రం దాపురించింది. 3, 9 గేట్లు పైకి లేపలేని పరిస్థితిని చూశాం. తొమ్మిదొవ గేటు రోప్ తెగిందనే విషయం తెలుసుకొని ఉదయం నందికొట్కూరు ఎమ్మెల్యే పోతిరెడ్డిపాడు వద్దకు వచ్చి ఉన్నగేట్లు మూసి వేయించారు. మరి గేట్లు మూసి ఏం సాధించాలనుకున్నాడో అర్థం కావటం లేదు. ఓటుకు నోటు కేసులోంచి బయటపడేందుకే చంద్రబాబు రాజధానిని వదులుకొని విజయవాడకు వచ్చారని, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి దీన్ని అలుసుగా తీసుకుని శ్రీశైలం నీటిని యథేచ్ఛగా వాడుకుంటున్నాడన్నారు. తెలంగాణలో నిర్మించిన, నిర్మిస్తు న్న ఏ ప్రాజెక్టుకు అనుమతుల్లేవన్నారు. – శిల్పా చక్రపాణిరెడ్డి, శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే
పోతిరెడ్డిపాడు మెయింటెనెన్స్ విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. రాయలసీమ ప్రజలకు నీళ్లు అలవాటు చేస్తే వారు ప్రశ్నిస్తారు. వారు ప్రశ్నిస్తే మన పరిస్థితి చాలా బ్యాడ్‌గా ఉంటుందనే ఉద్దేశంతో పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను చంద్రబాబునాయుడు పర్యవేక్షించకుండా శిథిలమయ్యేలా చేస్తున్నారు. – దారా సుధీర్, నందికొట్కూరు సమన్వయకర్త


