● పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద
వరుస ఘటనలు
● నిన్న తెగిన 9వ గేటు రోప్
● నేడు 3వ గేటు ప్లంబర్‌బ్లాక్ కట్
● మరమ్మతులకు మంజూరైన
నిధులు ఏమైనట్లు
రాయలసీమ ప్రాజెక్ట్‌లకు జీవనాడిగా ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నిర్వహణను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. నిర్వహణకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటిస్తున్నా ఆ నిధులతో పనులెక్కడ చేశారో అధికారులకే తెలియాలి. రెండు రోజుల వ్యవధిలో 9వ గేటు రోప్ తెగడం, 3వ గేటు ప్లంబర్‌బ్లాక్ కట్ కావడం చూస్తే నిర్వహణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది రూ.20 లక్షలు, ఈ ఏడాది రూ.46 లక్షల నిధులు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ రోప్ రోలర్లు తుప్పు పట్టి కనిపిస్తుండటంతో గేట్లకు మరమ్మతులు చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది ఆలస్యంగా పోతిరెడ్డిపాడు నుంచి నీటిని విడుదల చేశారు. మరో వైపు నిధులు మంజూరయ్యాయని అధికారులు చెబుతున్నారు. అయితే గేట్లకు మరమ్మతులు చేయించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గురువారం సాయంత్రం అధికారుల పర్యవేక్షణలో తొమ్మిదో గేటును పైకి ఎత్తి కిందికి దించేందుకు యత్నించగా గేటు రోప్ తెగిపోయింది. దీంతో గేటు గ్రూస్‌లో కిందికి దిగింది. శుక్రవారం మూడోవ గేటు ప్లంబర్‌బ్లాక్ కట్ కావడం అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇలా ఒక్కొక్కగేటు ఓ రకంగా మరమ్మతులకు గురవుతుండటంతో నీటి విడుదలకు ఆటంకం కలిగే అవకాశం నెలకొంది. ఉన్నతాధికారులు వెంటనే పోతిరెడ్డి హెడ్‌రెగ్యులేటర్‌ను సందర్శించి లోపాలను గుర్తించి సరిచేయాల్సిన అవసరం ఉంది.


