మత్స్యశాఖ అధికారుల చేతివాటం | - | Sakshi
Sakshi News home page

మత్స్యశాఖ అధికారుల చేతివాటం

Sep 12 2026 1:48 AM | Updated on Sep 12 2026 1:48 AM

లైసెన్స్‌ రెన్యూవల్‌కు మామూళ్ల వసూళ్లు

పింఛన్‌ దరఖాస్తు సిఫారసుకు

రూ.2 వేలు డిమాండ్‌

పగిడ్యాల: చేపల వేటనే జీవనాధారంగా కుటుంబ పోషణ చేస్తున్న మత్య్సకారుల లైసెన్స్‌ రెన్యూవల్‌, పింఛన్‌ దరఖాస్తు కోసం అధికారులు మామూళ్లు వసూళ్లు చేస్తున్నట్లు మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం కొత్త పింఛన్ల మంజూరు కోసం దరఖాస్తు గడువు ఈ నెల 16వ తేదీ వరకు అవకాశం కల్పించింది. మండలంలోని నెహ్రూనగర్‌ గ్రామంలో దాదాపు 1000 మందికి పైగా మత్య్సకార లైసెన్స్‌దారులు పింఛన్‌కు దరఖాస్తు చేసేందుకు సచివాలయాలకు క్యూ కట్టారు. అయితే గ్రామ మత్య్సశాఖ అసిస్టెంట్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు గుంజుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఏటా లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకున్నా మత్య్సకారుల నుంచి రూ. 600, లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసుకోకుండా రెండు, మూడేళ్లు ల్యాప్స్‌ అయిన వారి నుంచి రూ. 2 వేల నుంచి రూ. 3 వేల వరకు వసూలు చేస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మత్స్యకార పింఛన్‌ దరఖాస్తును సిఫారసు చేసేందుకు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి సంతకం చేయాలంటే రూ. 2 వేలు సమర్పించుకోవాల్సిందేనని డిమాండ్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అధికారులు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దరఖా స్తును సిఫారసు చేస్తారో లేదోననే అనుమానాలను మత్య్సకారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వసూళ్ల వెనుక గతంలో ఇక్కడ పని చేసి బదిలీ అయిన ఉద్యోగి పాత్ర ఉన్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై నందికొట్కూరు మత్య్సశాఖ అభివృద్ధి అధికారి భరత్‌లాల్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా లైసెన్స్‌ రెన్యూవల్‌ చేసేందుకు రూ. 500లు మాత్రమే చెల్లించాలన్నారు. మత్య్సకారుల నుంచి అక్రమ వసూళ్లకు ఎవరూ పాల్పడడం లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement