అడుగంటిన ‘ప్రథమ’ ఆశలు! | - | Sakshi
Sakshi News home page

అడుగంటిన ‘ప్రథమ’ ఆశలు!

Sep 11 2026 11:09 AM | Updated on Sep 11 2026 11:09 AM

కర్నూలు సిటీ: కర్ణాటక రాష్ట్రంలోని హొస్పేట్‌ వద్ద ఉన్న తుంగభద్ర జలాశయంలో 89 టీఎంసీల నీరు ఉన్నా..ఔట్‌ ఫ్లో 9,819 క్యూసెక్కులు ఉన్నా.. కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిలో చుక్కనీరు కనిపించడం లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా నది తడారి ఎడారిగా కనిపిస్తోంది. నదిపై నిర్మించిన సుంకేసుల బ్యారేజీలో నీరు అడుగంటిపోయింది. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలోని ప్రజల తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్న నీటిని సైతం బుధవారం ఉదయం బంద్‌ చేశారు. ప్రథమ పూజ్యుడైన వినాయక నిమజ్జనానికి నీరు ఇవ్వలేమని మంత్రి టీజీ భరత్‌ చెప్పారు. దీంతో ముందస్తుగా డబ్బులు ఇచ్చి పెద్ద విగ్రహాలను తీసుకొచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇదీ దుస్థితి..

తుంగభద్ర నదిలో ఏటా 250 నుంచి 400 టీఎంసీలకుపైగా నీటి లభ్యత ఉంది. ఇందులో 10 శాతం నీటిని కూడా వినియోగించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల్లో సైతం డ్యాంకు 89 టీఎంసీల నీరు వచ్చి చేరింది. అయితే ఆ నీరుతో కనీసం ప్రజల తాగునీటి అవసరాలు కూడా తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి. టీబీ డ్యాం లో నీటి లభ్యతలో దమాషా ప్రకారం కేసీ కెనాల్‌కు ఐదు టీఎంసీల నీటి వాటా వస్తుంది. ఆ నీటిని నది ద్వారా విడుదల చేస్తే 20 శాతం కూడా రాదని ఇంజినీర్లు అంటు న్నారు. అయితే తుంగభద్ర దిగువ కాలువ నీటిని జీడీపీ (గాజులదిన్నెప్రాజెక్టు)కు మళ్లించి..అక్కడి నుంచి కేబీసీ కాలువ ద్వారా జి.శింగవరం సమీపంలో కేసీ కాలువకు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంది. ఈ విషయం ఇంజినీర్లకు సైతం తెలిసినా ఎందుకు ఆ వైపుగా మంత్రిని, కలెక్టర్‌ను ఒప్పించలేకపోతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

కేసీలోనే నిమజ్ఞనం చేసుకోవచ్చు

గాజులదిన్నె ప్రాజెక్టులో ప్రస్తుతం 2.4 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఈ ప్రాజెక్టులోకి హంద్రీ–నీవా కాలువ 110 కి.మీ దగ్గర వైఎస్సార్‌సీపీ హయాంలో నిర్మించిన స్లూయిజ్‌ నుంచి 250 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పాటు తుంగభద్ర దిగువకాలువ పరిధిలోని తాగునీటి ట్యాంకులు నింపిన తరువాత ఆ నీటిని జీడీపీలోకి మళ్లించేందుకు అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నుంచి ఎడమ కాలువ నీటి ని విడుదల చేసి 6 కి.మీ. దగ్గర క్రాస్‌ రెగ్యులేటర్‌ క్లోజ్‌ చేస్తే ఆ నీరు కర్నూలు బ్రాంచ్‌ కెనాల్‌ 7.78 కి.మీ దగ్గర నుంచి 42 కి.మీ. వరకు ప్రవహిస్తుంది. ఆ నీటిని ఉల్చాల దగ్గర ఓ వాగులో కి వదిలేస్తే జి.శింగవరం దగ్గర కేసీ కాలువలోకి చేరుతుంది. ఆ నీటితో కర్నూలు తాగునీటి అవసరాలు, ఆ నీటిలోనే కర్నూలు నగరంతో పాటు చుట్టు గ్రామాల ప్రజలు వినాయక నిమజ్జనం చేసుకునేందుకు అవకాశం ఉంది. కానీ టీడీపీ నేతలు ఆ దిశగా ఆలోచన చేయలేదు. విగ్రహాలు చిన్నవి ఏర్పాటు చేసుకోండి అంటూ భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తుంగభద్ర నదిలో

కనిపించని నీరు

వెలవెలబోతున్న సుంకేసుల

జలాశయం

వినాయక నిమజ్జనానికి

తప్పని తిప్పలు

గుండ్రేవుల నిర్మిస్తే..!

కేసీ కాలువకు తుంగభద్ర జలాల్లో 31.9 టీఎంసీల నీటిని కేటాయించినా నిల్వ చేసుకునేందుకు రిజర్వాయర్లు లేవు. సుంకేసుల లో 1.2, అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వా యర్‌లో 2.965 టీఎంసీలకు మాత్రమే నిల్వ చేయవచ్చు. ఏటేటా నీటి ప్రవాహ రోజులు తగ్గిపోవడంతో కేసీ కెనాల్‌ కింద సాగుకు, తాగునీటి అవసరాలకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కేడబ్ల్యూడీటీ–1 కేటాయింపుల మేరకు నీటిని నిల్వ చేసుకునేందుకు దశాబ్దాలుగా డిమాండ్‌ చేస్తున్న గుండ్రేవులు ప్రాజెక్టును(20 టీఎంసీల నిల్వ సామర్థ్యం) నిర్మిస్తే నీటి కష్టాలు తొలుగుతాయి. కర్నూలు నగరంతో పాటు చుట్టూ ఉండే పల్లెల్లో వినాయక నిమజ్ఞనానికి ఎలాంటి నీటి కష్టాలు లేకుండా ఉంటాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement