శ్రీశైలంటెంపుల్: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద వితరణ పథకానికి పలువురు భక్తులు రూ.3 లక్షల విరాళాలు అందించారు. గురువారం నాగర్‌కర్నూలుకు చెందిన బాలనాగయ్య రూ.లక్ష, గుంటూరుకు చెందిన ఎం.అమృత రూ.లక్ష, గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎం.రామకృష్ణారెడ్డి రూ.లక్ష విరాళాన్ని దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి ఎం.ఫణిధరప్రసాద్‌కు అందజేశారు. విరాళాలు అందించిన దాతలకు దేవస్థానం తరఫున స్వామివారి శేషవస్త్రాలను, లడ్డూప్రసాదాలను అందించి సత్కరించారు.
సర్వర్ పని చేయదు.. విద్యుత్ ఉండదు!
చాగలమర్రి: కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు వింతతువులు, వికలాంగులు, వృద్ధులు సచివాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి ఉన్నా దరఖాస్తు పూర్తి కావడం లేదు. నెట్‌వర్క్ సరిగా లేక పోవడం, సర్వర్ డౌన్ అవుతుండటంతో దరఖాస్తుదారులు గంటల కొద్ది అక్కడే నిరీక్షించాల్సి వస్తోంది. మరో వైపు మండలంలో విద్యుత్ తీగల మరమ్మతులు జరుగుతుండటంతో అప్రకటిత విద్యుత్ కోతలు ఆటంకంగా మారాయి. దీంతో రోజుకు 5 నుంచి 10 లోపే దరఖాస్తులు ఆన్‌లైన్ అవుతున్నాయి. దీంతో దరఖాస్తుదారులు, సచివాలయ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. దరఖాస్తుకు ఆరు రోజులు గడువు కనిపిస్తున్నా.. అందులో మూడు రోజులు సెలవులు ఉండటంతో దరఖాస్తు ఎప్పుడు చేసుకోవాలని ప్రజలు వాపోతున్నారు.
15న ధ్రువపత్రాలతో హాజరు కావాలి
నంద్యాల(న్యూటౌన్): జిల్లాలోని ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్ల పెన్షనరీ బెన్‌ఫిట్స్ మంజూరు, ఫ్రీ రెగ్యులరైజేషన్ సర్వీసును పరిగణలోకి తీసుకునేందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసిందని డీఈఓ జనార్దన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు జిల్లాలో పని చేస్తున్న ఒకేషనల్ ఇన్‌స్ట్రక్టర్లందరూ తమ ఒరిజినల్ సర్వీస్ రిజిస్టర్, సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 15న డీఈఓ కార్యాలయానికి చేరుకుని ధ్రువీకరణ ప్రక్రియ ను పూర్తి చేసుకోవాలన్నారు.
నేటి నుంచి నాలుగు రోజులు బ్యాంకుల బంద్
కర్నూలు(అగ్రికల్చర్): బ్యాంకులకు ఐదు రోజుల పని విధానాన్ని వెంటనే అమలు చేయాలనే డిమాండ్‌తో అన్ని బ్యాంకు యూనియన్‌లు శుక్రవారం సమ్మె చేపట్టనున్నట్లు జిల్లా కన్వీనర్ నాగ రాజు తెలిపారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు సమ్మెలో కార్పొరేట్ బ్యాంకులు మినహా పబ్లిక్ సెక్టారు, ప్రయివేటు సెక్టారు బ్యాంకులు, గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు పాల్గొంటాయన్నారు. ఈ నెల 11 నుంచి 14వ తేదీ వరకు బ్యాంకులు బంద్ కానున్నాయి. 11న సమ్మె పాటిస్తుండగా.. 12న రెండవ శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి సెలవులు ఉన్నాయి. బ్యాంకుల సమ్మెకు సీఐటీయూ మద్దతు ప్రకటించింది.
వేలం పాటలో
రూ.73 లక్షల ఆదాయం
పాణ్యం: కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీవల్లి సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయంలో గురువారం నిర్వహించిన తలనీలాల వేలం పాటలో రూ.73.20 లక్షల ఆదాయం వచ్చింది. ఈఓ రామకృష్ణ మాట్లాడుతూ.. అనంతపురం జిల్లాకు చెందిన పుల్లయ్య అనే పాట దారుడు అత్యధిక పాట పాడి వేలం దక్కించుకున్నారన్నారు. గత ఏడాది రూ.51.77 లక్షల ఆదాయం సమకూరగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.21.42 లక్షలు అధిక ఆదాయం సమకూరినట్లు ఈఓ తెలి పారు. జిల్లా దేవదాయ శాఖ పర్యవేక్షణ అధికారి మోహన్ ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు.


