● విద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం
మంత్రాలయం రూరల్: విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఏపీ రాష్ట్రవిద్యాశాఖ జేడీ మువ్వా రామలింగం అన్నారు. మాధవరం, విద్యానగర్‌లోని ఎస్‌ఎంకెవీ జిల్లా ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన తనిఖీ చేశారు. మాధవరం జిల్లా ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. విద్యానగర్‌లోని ఎస్‌కేవీ హైస్కూల్‌లో ప్రధానోపాధ్యాయుడు, సిబ్బందితో మట్లాడుతూ.. 750 పైగా ఉన్న విద్యార్థులు ఉన్న హైస్కూల్ ప్రహారిగోడ లేక పోవడం ఆశ్యర్యానికి గురిచేసిందన్నారు. మంత్రాలయం ఆర్‌సీఎన్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుల సమావేశంలో మాట్లాడారు. అన్ని పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆదేశించారు. ఎంఈఓలు నాగభూషణం, రాఘన్న, హెచ్‌ఎంలు బోజరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు.
వానల్లేక జొన్నపంట తొలగింపు
మద్దికెర: వర్షాలు లేకపోవడంతో ఎండిపోతున్న జొన్న పంటను రైతు మిడుతూరు ప్రతాప్ గురువారం తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను మద్దికెర సమీపంలో మూడు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని జూన్‌లో జొన్న సాగు చేశానన్నారు. అడపాదడపా వర్షాలతో పైరు పెరిగా ఆగస్టు నుంచి వానల్లేక ఎండిపోయిందన్నారు. పెట్టుబడి కింద రూ.75,000 ఖర్చు వచ్చిందని, పంట ఎండిపోతుండటంతో పశువులకు మేతగా వస్తుందని తొలగించినట్లు చెప్పారు. అంతర పంటగా వేసిన కంది కూడా ఎండిపోతోందని రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరారు.
డోన్ ఏఎస్‌ఐ మృతి
డోన్ టౌన్/
కర్నూలు (టౌన్):
డోన్ పట్టణ పోలీసు స్టేషన్‌లో ఏఎస్‌ఐగా విధులు నిర్వహిస్తు న్న మద్దిలేటి (56) అనారోగ్య సమస్యలతో గురువారం మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడు తున్న ఆయనను ఇటీవల కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కోలుకొలేక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న డోన్ పట్టణ సీఐ ఇంతియాజ్‌బాషా కర్నూలుకు వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఏఎస్‌ఐ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
భర్త మద్యానికి
బానిస కావడంతో..
బనగానపల్లె రూరల్: భర్త మద్యానికి బానిసై రోజు వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బనగానపల్లె పట్టణంలోని బుడగజంగాల కాలనీకి చెందిన లక్ష్మీదేవి(45) భర్త పెద్ద తిరుపాల్ మద్యానికి బానిసై కుటుంబీకులతో రోజూ ఘర్షణ పడేవాడు. దీంతో లక్ష్మీదేవి తన భర్తతో మద్యం అలవాటు మానిపించేందుకు ఎంతో ప్రయత్నించింది. అయినా మార్పు రాకపోవడంతో గురువారం విష పౌడర్‌ను నీటిలో కలుపుకుని తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.. కాగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు హెడ్‌కానిస్టేబుల్ జనార్దన్ రెడ్డి తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మృతురాలికి ఇద్దరు సంతానం ఉన్నారు.
ఇద్దరు నిందితుల అరెస్ట్
ఉయ్యాలవాడ: కాంట్రాక్టర్‌ను బెదిరించి డబ్బులు లాక్కపోయిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ రామిరెడ్డి తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల మేరకు.. బుధవారం సాయంత్రం కాంట్రాక్టర్ దూదేకుల జమాల్ బైక్‌పై వెళ్తుండగా గ్రామ సమీపంలో కాకరవాడ గ్రామానికి చెందిన ప్రసన్నకుమార్, రవి దాడి చేసి కొట్టి, బెదిరించి రూ. 5 వేలు నగదు దోచుకుని పారిపోయారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గురువారం ఉదయం ఉయ్యాలవాడ కరెంట్ ఆఫీస్ సమీపంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి బైక్, రూ. 5 వేలు నగదు, రెండు బైక్ స్టీల్ స్టంప్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్ విధించారన్నారు.


